Goods Train Derails Between Peddapalli Ramagundam Stations : తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌లో ఐరన్ రోల్స్‌తో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. గూడ్స్ రైలు కర్ణాటకలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు వెళుతోంది. కరీంనగర్, పెద్దపల్లి స్టేషన్లు దాటిన తర్వాత రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేట్‌కు కొద్ది దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ శబ్దంతో పట్టాలు తప్పడంతో సమీప గ్రామస్థులు ప్రమాద స్థలికి చేరుకున్నారు.
Goods Train Derails in Telangana : గూడ్స్ రైలు బోల్తా విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన రైల్వే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఈ మార్గంలో వెళ్తున్న పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు. 44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్ అధిక లోడు వల్లే పట్టాలు తప్పినట్లు అధికారులు భావిస్తున్నారు. రైలు బోగీల మధ్య ఉన్న లింకులు తెగిపోవడంతో పాటు ఒకదానిపై మరొకటి పడి అక్కడి ప్రదేశం దెబ్బతింది.
పట్టాలు తప్పిన గూడ్స్ - రైళ్ల రాకపోకలకు అంతరాయం
నిలిచిపోయిన పలు రైళ్లు : గూడ్స్ పట్టాలు తప్పిన విషయం తెలియడంతో రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వల్ల ఈ మార్గంలో ఉన్న మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో ఖాజీపేట-బల్లార్షా మార్గంలో పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఉత్తర-దక్షిణ భారతదేశాలకు కీలకమైన మార్గం కావడంతో మంగళవారం రాత్రి వేళ నడిచే రైళ్లను అధికారులు ఆయా స్టేషన్లలో నిలిపేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్‌లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం తెల్లవారుజాము వరకు పట్టాలను బాగు చేసే దిశగా రైల్వే అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.
ఘటనపై బండి సంజయ్ ఆరా : ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే జీఎంతో ఫోన్లో మాట్లాడారు. తక్షణ సహాయ చర్యల్ని తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మార్గంలోని ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు. బుధవారం ఉదయం వరకు పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు కేంద్ర సహాయ మంత్రి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
పలు రైళ్లు రద్దు : రైళ్లు మూడు రైల్వే ట్రాక్‌లపై పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయా రూట్లలో వెళ్లాల్సిన 39 రైళ్లును పూర్తిగా రద్దు చేయగా, 7 పాక్షికంగా రద్దు చేశారు. 53 రైళ్లను దారి మళ్లించారు. 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. నర్సాపూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - నాగ్‌పూర్, హైదారాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్, కాజీపేట - సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ -బోధన్, సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ - బల్లర్షా, బల్లార్ష - కాజీపేట, యస్వంత్ పూర్ - ముజఫర్ పూర్, కాచిగూడ - నాగర్ సోల్, కాచిగూడ - కరీంనగర్, సికింద్రాబాద్ - రామేశ్వరం, సికింద్రాబాద్ - తిరుపతి, అదిలాబాద్ - పర్లి, అకొలా - పూర్ణ, అదిలాబాద్ - నాందేడ్, నిజామాబాద్ - కాచిగూడ, రాయచూర్ - కాచిగూడ, గుంతకల్ - బోధన్ రైళ్లను రద్దు చేశారు.
అగర్తలా-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం- పట్టాలు తప్పిన 8బోగీలు