Good Days for AP Grama Panchayats: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదేళ్ల తర్వాత పల్లెల్లో తిరిగి సందడి కనిపించింది. ఏ గ్రామానికి వెళ్లినా పంచాయతీల ఎదుట టెంట్లు దర్శనమిచ్చాయి. మైకుల్లో నేతల ప్రసంగాలు, గ్రామాభివృద్ధిపై హామీలు వినిపించాయి. అధికారులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలతో కలసి జరిపిన గ్రామ సభ ఊరూరా నిండు కొలువుని తలపించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 326 గ్రామాల్లో అంతటా ఒకటే చర్చ. ఊరిలో సమస్యలేంటి? ముందు ఏ పనులు చేయాలి? ఖర్చు ఎంతవుతుంది.? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఎప్పటిలోగా పూర్తి చేయాలనే చర్చ వినిపించింది. ప్రజలు కష్టాలను ధైర్యంగా చెప్పారు. సర్పంచ్‌లు సావధానంగా విన్నారు. పనులు చేస్తామని హామీ ఇచ్చారు. చేయాల్సిన పనులపై తీర్మానాలు చేశారు.
4500 కోట్లతో 87 రకాల పనులు: తొలుత ఉపాధి హామీ పథకం కింద 4 వేల 500 కోట్లతో 87 రకాల పనులు చేపట్టాలన్న ప్రభుత్వం ఆదేశాలతో అర్హులకు జాబ్ కార్డుల మంజూరుకు గ్రామ సభలు తీర్మానించాయి. పథకం కింద చేపట్టాల్సిన వ్యవసాయ అనుబంధ పనులను గుర్తించి ఆమోద ముద్ర వేశాయి. పంట కాలువల తవ్వకం, నీటి కుంటల నిర్మాణం, పండ్ల తోటలు, భూసార సంరక్షణ చర్యలు, పశువులు షెడ్లు, కోళ్ల ఫారాల నిర్మాణం వంటి పనులకు పచ్చజెండా ఊపాయి. మౌలిక వసతుల పనులను గుర్తించి ఆమోదించారు. పనులు వెంటనే మొదలు పెట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వం ఇచ్చే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సర్పంచులు కార్యాచరణ రూపొందించి ప్రజల ముందుంచారు. సమస్యల్లో సత్వర పరిష్కరించాల్సిన వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తూ తీర్మానించారు. ఐదేళ్ల తర్వాత గ్రామాల్లో తిరిగి అభివృద్ధి పనులు చేపట్టే దిశగా అడుగులు పడటంపై సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గడచిన ఐదేళ్లలో పడిన కష్టాలను గ్రామ సభ వేదికగా సర్పంచులు గుర్తు తెచ్చుకున్నారు. మాట మాత్రమైనా చెప్పకుండా గత వైఎస్సార్సీపీ సర్కారు పంచాయతీల నిధులను లాగేసుకోవడంతో కనీసం బ్లీచింగ్ చల్లేందుకు అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వడాన్ని ప్రజలు స్వాగతించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాబోయే ఐదేళ్లలో తమ గ్రామాలకు మంచి జరుగుతుందని అన్ని విధాలా అభివృద్ధి పథాన ముందడుగు వేస్తాయని సర్పంచులు , ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.
"మేము ఇప్పటి వరకూ ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయాము. ఏ వర్క్ కూడా చేయలేకపోయాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు మంచిరోజులు వచ్చాయి. మా నిధులు మాకు ఇప్పించినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పారిశుద్ధ్యం, నీరు, వీధి లైట్లు ఇలా అన్ని పనుల గురించి గ్రామ సభలో ఎస్టిమేట్ చేయడం జరిగింది". - ఇందర, ఈడుపుగల్లు సర్పంచ్
"గతంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చేవి. కానీ అవన్నీ పేపర్లోనే ఉండేవి. నిధులు లేక మేము ఏమీ చేయలేకపోయేవాళ్లం. చాలా చక్కగా ప్రజలంతా హాజరైన గ్రామ సభ ఇది అని చెప్పుకోవచ్చు. అందరూ వారి సమస్యలు చెప్పుకున్నారు. వాటన్నింటినీ పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము". - గంగారత్నం, ప్రసాదంపాడు సర్పంచ్