Bhadrachalam Godavari Water Level Today News : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 46న్నర అడుగులు దాటి ప్రవహిస్తుండగా ప్రస్తుతం అది 48 అడుగులకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 25 గేట్లను ఎత్తి 57 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగు గొబ్బలి మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం పెరిగితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల వెళ్లే ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరనున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అప్రమత్తమైన అధికారులు : భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 73 అడుగుల స్థాయిని తాకితే పరవాహక ప్రాంతాల్లో 109 గ్రామాలతో పాటుగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని చెప్పారు. 2023లో 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ స్థాయిలో ఏ గ్రామం ప్రభావితమవుతుందనే వివరాలను నీటిపారుదలశాఖ పోర్టల్లో ఉంచినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తెలిపారు. గోదావరి, కృష్ణా పరీవాహకాల్లోని ప్రాజెక్టుల వద్ద ఇంజినీర్లను అప్రమత్తం చేశామన్నారు.
తెలంగాణలో రికాం లేని వానలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - Heavy Rains Across Telangana
నీటి ప్రవాహం పెరిగితే ఆ గ్రామాలకు ముప్పు : గోదావరి వరద ఉద్ధృతమయ్యే కొద్ది దుమ్ముగూడెం మండలంతోపాటు భద్రాచలం పట్టణానికే ఎక్కువ ముంపు పొంచి ఉందని అధికారులు తెలిపారు. 43-48 అడుగుల మధ్య భద్రాచలానికి ముంపు ముంచుకొస్తుందని పేర్కొన్నారు. 48-53 అడుగుల మధ్య చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 13 గ్రామాలు, భద్రాచలం ప్రభావితమవుతాయని వెల్లడించారు.
53-58 అడుగుల మధ్య చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని 48 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. 63 నుంచి 68 మధ్య ఆరు మండలాల్లోని 85 గ్రామాలు, 73 అడుగుల స్థాయికి వరద చేరితే భద్రాచలం, 109 గ్రామాలు ముంపు బారినపడనున్నాయని తెలిపాారు. మండలాల వారీగా చూస్తే చర్లలో 26, దుమ్ముగూడెంలో 51, బూర్గంపాడులో 5, అశ్వాపురంలో 11, మణుగూరులో 6, పినపాకలో 10 గ్రామాలకు వరద గండం ఉందని నీటిపారుదలశాఖ అధికారులు తెలపారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో దిగువ ప్రాంతాల ఉన్న విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు రోడ్డుపైకి రావడంతో భద్రాచలం నుంచి కూనవరం వీఆర్పురం చింతూరు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.