GRMB Meeting on Peddavagu Project in Hyderabad : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కొట్టుకుపోయిన పెద్ద వాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఇతర పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం పొందే అవకాశాన్ని పరిశీలించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకాల ద్వారా నిధుల కోసం ప్రయత్నించాలని జీఆర్ఎంబీ ఛైర్మన్ ముకేశ్ కుమార్ సిన్హా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీర్లకు తెలిపారు.
పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై రెండు రాష్ట్రాల ఇంజినీర్లతో బోర్డు హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. ఛైర్మన్ ముకేష్ కుమార్ సిన్హా నేతృత్వంలో జరిగిన సమావేశంలో గోదావరి బోర్డు సభ్యులు రాజీవ్ కుమార్ కనోడియా, ఎస్ఈ ప్రసాద్‌తో పాటు తెలంగాణ నుంచి ఈఈ సురేశ్, ఏపీ నుంచి ఎస్ఈ దేవప్రకాశ్, ఇతర ఇంజినీర్లు హాజరయ్యారు. పెద్దవాగు ప్రాజెక్టు పరిస్థితి, ఇటీవల కొట్టుకుపోయిన ఉదంతంలో జరిగిన నష్టం, మరమ్మతుల గురించి సమావేశంలో ఇంజినీర్లు వివరించారు.
నిధుల నిష్పత్తిని కొనసాగించాలని : రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్డీఎస్ఏకు నివేదిక పంపినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు, ఆధునీకరణకు సంబంధించి గతంలో తీసుకున్న చర్యలు, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. రెండు రాష్ట్రాలు గతంలో అంగీకరించిన విధానంగా నిధుల నిష్పత్తిని కొనసాగించాలని జీఆర్ఎంబీ ఛైర్మన్ సూచించినట్లు తెలిసింది. తక్షణ మరమ్మతుల కోసం రూ.మూడున్నర కోట్ల వరకు అవసరమవుతాయని జీఆర్ఎంబీ అంచనా వేసినట్లు సమాచారం. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ పథకం ద్వారా ఆనకట్ట, సంబంధిత పనులు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం ద్వారా కాల్వలు, సంబంధిత పనులకు దరఖాస్తు చేయాలని రెండు రాష్ట్రాల ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది.
పెద్దవాగు ప్రాజెక్టును పునర్నిర్మాణం : రాష్ట్రంలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టు పెద్ద వాగుకు 250 మీటర్ల పొడవున గండి పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 18.6 అడుగులు దాటడం, మూడు క్రస్ట్‌గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో కట్ట తెగింది. దీంతో ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, అటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది.
అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి - తెలంగాణ, ఏపీలకు జీఆర్ఎంబీ సూచన