Godavari River Turns as Suicide Spot : గోదావరి నది అని చెప్పగానే గలగలా పారే నది అందరికీ గుర్తొస్తుంది. స్వచ్ఛమైన నీళ్లు పారుతుంటే మనసు పరవశించి పోతుంది. అనేక మంది పుణ్యస్నానాలు సైతం ఆచరిస్తారు. అయితే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి నది తీరం సూసైడ్ స్పాట్‌గా మారిపోయింది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన అనేక మందికి చనిపోవాలనుకునే ముందు యంచ వద్ద గోదావరి తీరమే గుర్తుస్తోంది. అంతలా ఆత్మహత్యలకు చిరునామాగా మారిపోయింది. వివిధ సమస్యలతో ఒత్తిడితో చావే శరణ్యమని భావించి యంచ వద్ద గోదావరి నదిలో ప్రాణాలు వదిలేస్తున్నారు.
విద్యార్థుల నుంచి మొదలు వృద్ధుల వరకు అంతా ఇక్కడే చనిపోతున్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలి వస్తుంటారు. మరోవైపు వివిధ కారణాలతో నదిలో దూకి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆత్మహత్యలతో బాధిత కుటుంబీకులకు తీరని శోకం మిగులుతోంది. నవీపేట మండలం యంచ వంతెన వైపు మూడేళ్లలో 25 మంది, నిర్మల్ జిల్లా బాసర వైపు ఆరు నెలల్లో 44 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నది పరిసర ప్రాంతాలు ఆత్మహత్యలకు కేంద్రంగా : వారధి మీదుగా నీటిలో దూకిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. నది పరిసర ప్రాంతాలు ఆత్మహత్యలకు కేంద్రంగా మారడంపై సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నదిలో నిత్యం మత్స్యకారులు చేపల వేట కోసం వస్తారు. నీళ్లలో దూకిన వారిని సమీపంలో ఉండే మత్స్యకారులు, అటుగా వెళ్లే యంచ యువకులు పదుల సంఖ్యలో తరచూ రక్షిస్తున్నారు. గతంలో ఓ యువతి, ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి వేర్వేరుగా నదిలో దూకగా యంచ మత్స్యకారులు యువతి, పిల్లల ప్రాణాలు కాపాడారు.
నిజామాబాద్ పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు ప్రాణాలు కాపాడిన యువకులను అభినందించారు. అయితే సరైన రక్షణ చర్యలు, పహారా లేకపోవడంతో ప్రాణాలు నీళ్లలో కలిసిపోతున్నాయి. యంచ వద్ద గోదావరి తీరంలో ఎక్కువ ఎత్తులో రక్షణ కంచె ఏర్పాటు చేస్తే నదిలోకి దూకే అవకాశం లేకుండా పోతుందని స్థానికులు అంటున్నారు. యంచ వద్ద బాసర వంతెన వద్ద లేక్ పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో బాధితుల ప్రాణాలు తక్షణమే రక్షించే వీలు ఉంటుంది. సీసీ కెమెరాలు, వారధికి ఇరువైపులా వీధి దీపాలతో పాటు ఎత్తులో ఇనుప కంచెలు బిగిస్తే ఆత్మహత్యలను కొంతైనా నివారించవచ్చు.
'గోదావరి నది అంటే పుణ్యక్షేత్రం వంటిది. కానీ ఈ నదిలో విద్యార్థులతో సహా చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టి కంచె ఏర్పాటు చేయాలి. సరైన రక్షణ చర్యలు, పహారా లేకపోవడం వల్లే ప్రాణాలు పోతున్నాయి'-స్థానికులు
ఆపదకు నెలవుగా గోదావరిఖని వంతెన - ఏటా 100 మందికి పైగా బలి, అయినా చర్యలేవీ?