Girls Were Suitable for Sea Adventures : భూమండలాన్ని మూడొంతులు ఆక్రమించిన సముద్రాల గురించి మనకు తెలిసింది ఆవగింజంతే! తక్కిన రహస్యాలు తెలుసుకోవాలంటే కడలి లోతులపై అవగాహన ఉండాలంటారు 88 ఏళ్ల సిల్వియా ఎర్లీ. తన జీవితం మొత్తాన్ని సంద్రపు అన్వేషణలో గడిపిన ఈ శాస్త్రవేత్త, సముద్ర జీవితంపై పలు రకాల రచనలు చేశారు.
1200 అడుగుల లోతుకు వెళ్లిన రికార్డుతో, ‘హెర్ డీప్‌నెస్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు. మిషన్ బ్లూ అనే సంస్థను స్థాపించి, తన కుమార్తె లిజ్‌టేలర్‌తో కలిసి సముద్ర యాత్రలు నిర్వహిస్తుంటారీమె. మొదటిసారి సముద్రంలోకి ఆల్‌విమెన్ టీంని తీసుకెళ్లి, సంద్రపు జీవితంపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘స్కూబా డైవింగ్ చేయడానికి మగవాళ్లకంటే ఆడవాళ్ల శరీరమే అనువుగా ఉంటుందని, వాళ్లతో పోలిస్తే తామే ఆకృతిలో చిన్నగా ఉంటామంటున్నారు.
Sea Exploration : అంతేకాకుండా ఊపిరితిత్తులూ చిన్నగా ఉంటాయని, కండబలం తక్కువని, నడుము, హిప్స్ దగ్గర కొవ్వు ఎక్కువగా ఉండటం సహజమంటూనే, ఫిట్‌నెస్ పరంగా తమకున్న ఈ లోపాలే సముద్రాలని అన్వేషించే క్రమంలో వరంగా మారుతున్నాయని చెప్పుకొస్తున్నారు. అవును, కడలిలో డైవింగ్ చేయాలంటే సిలిండర్ల నుంచి గాలి తక్కువ తీసుకోవాలి. అలా అయితేనే నీటిలో ఎక్కువ సమయం ఉండగలరు. ఇవన్నీ డీప్ స్కూబా డైవింగ్, సముద్ర శాస్త్రం, ఓషన్ ఫొటోగ్రఫీ, మెరైన్ బయాలజిస్టులుగా మారి ప్రకృతిని కాపాడే శక్తినిస్తున్నాయి.
అన్నింటికీ మించి ప్రకృతిని ప్రేమించే గుణం కూడా మనల్ని సముద్రాల అన్వేషణకీ, ఆ రంగంలో కెరియర్‌ని నిర్మించుకొనేందుకు దోహదం చేస్తుందంటున్నారు సిల్వియా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ స్కూబా డైవింగ్ రంగంలో 69 శాతం మగవాళ్లుంటే 30 శాతం మాత్రమే మహిళలున్నారు. ఇప్పుడిప్పుడే సముద్రాల అన్వేషణలో ఓషనోగ్రాఫర్లుగా, స్కూబా డైవర్లుగా అతివలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.
సముద్ర గర్భంలోకి వెళ్లిన తొలి మహిళా స్కూబా డైవర్ సిమోన్ : ఫ్రెంచ్ నౌకాధికారి జాక్వెస్ నీటి అడుగు భాగంలో ప్రయాణించేందుకు వీలుగా ‘ఆక్వాలంగ్’ పరికరాన్ని తొలిసారి ఆవిష్కరించారు. ఆ ఇనోవేషన్‌కు అసలు స్ఫూర్తి జాక్వెస్ భార్య సిమోన్. ఆ ఆక్వాలంగ్ సాయంతో సముద్ర గర్భంలోకి వెళ్లిన సిమోన్ తొలి మహిళా స్కూబా డైవర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలా మొదలైన అతివల ప్రస్థానం ఇప్పుడు మరింత వేగంగా ముందుకెళుతోంది. ఇక మనదేశం విషయానికొస్తే, తమిళనాడుకు చెందిన నీలాభాస్కర్ దేశపు తొలి సర్టిఫైడ్ కేవ్ డైవర్‌గా పేరు తెచ్చుకున్నారు.
భూమిపై ఉన్నట్టుగానే సంద్రపు అడుగునా నిగూఢమైన గుహలుంటాయి. వీటి నుంచి వెలువడే ప్రమాదకర వాయువులు కూడా కడలి కాలుష్యానికి కారణమే. ఆ గుహలని కనిపెట్టి పరిశోధనలకు తగిన సమాచారం ఇస్తారీమె. మాయా పిళ్లై, పాలక్ శర్మ, మధుమతి, అర్చనా సర్దానా వంటివారు స్కూబా డైవింగ్‌ని కెరియర్‌గా చేసుకుని, అందులో ఇప్పుడు బాగా రాణిస్తున్నారు. ఉమెన్ డైవర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా మహిళల్ని డైవింగ్‌లో ప్రోత్సహిస్తూ, అతివలకు స్కాలర్‌షిప్‌లు, నెట్‌వర్కింగ్ తోడ్పాటుని అందిస్తోంది.
నాచు వేటతో పబ్బం గడుపుతున్న దేశీ డైవర్లు : అది శ్రీలంకకీ, ఇండియాకీ మధ్య ఉన్న పంబన్ ప్రాంతం. సాధారణంగా కంటే ఇక్కడ ఎండ ఎక్కువ. చుర్రుమనే ఆ వేడిలో చేతులకు గుడ్డపీలికలు చుట్టుకున్నారు. ఎందుకంటే సముద్రం అడుగున ఉండే పదునైన రాళ్లు ఆ అరచేతులని చీల్చేయకుండా కాపాడుకోవాలని. అదేవిధంగా కాళ్లకు రబ్బరు చెప్పులు తొడుక్కున్నారు. విషపు చేపల బారి నుంచి రక్షించుకొనేందుకు నడుం నలువైపులా గోనెపట్టా కట్టుకున్నారు. అంతా యాభై నుంచి అరవైఏళ్లు ఉన్నవాళ్లు.
వయసుని లెక్క చేయకుండా సముద్రంలోకి ధైర్యంగా దూకారు. కొన్ని నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి, కడలి బంగారం సముద్ర నాచుని ఏరి తెచ్చుకున్నారు. ఒడ్డుకొచ్చాక ఆ నాచుని కిలోల లెక్కన అమ్మారు. ఇప్పుడు మనం పైన చెప్పుకొన్న డైవర్లకున్నట్టుగా అండర్ వాటర్‌లోకి వెళ్లేందుకు అవసరం అయిన సామానేమీ వీళ్లకు లేవు. అమ్మమ్మలకాలం నుంచీ ఈ సంప్రదాయ విద్యను నేర్చుకుని నాచు వేటతో పబ్బం గడుపుతున్న ట్రెడిషనల్ దేశీ మహిళా డైవర్లు వీళ్లు. మగవాళ్లు ఈవిధంగా సంద్రపు అడగుకు వెళ్లరు.
Sea Water Adventure Experience : ఈ పనిచేయాలంటే చాలా ఓపిక, సహనం ఉండాలి. ముందే అనుకున్నట్టుగా ఊపిరిని బిగపట్టే సత్తువ ఉండాలి. ఇవే వీళ్లకి జీవనోపాధిని ఇస్తున్నాయి. సముద్రం సంపద ఇస్తుంది కదాని ఘడియకోసారి కడలిలోకి వెళ్లరు. నిర్ణీతకాలంలో అలల తాకిడి తక్కువగా ఉండే టైంలో మాత్రమే నాచుని తీస్తారు. పైగా ఒకసారి తీస్తే బ్రేక్ ఇచ్చి ఆ నాచు పెరిగిన తరవాతే మళ్లీ వేటకు వెళ్తారు. ఇలా ప్రకృతిని గౌరవిస్తూ తమిళనాడు రాష్ట్రంలో 5000 వేలమంది ఉపాధి పొందుతున్నారు.
"మన ఇండియా చుట్టూ సముద్రమున్నా, స్విమ్మింగ్ నేర్చుకునే ఆడవాళ్లు తక్కువగా ఉంటారు. కానీ మెరైన్ సైన్స్ విభాగంలో అనేక అవకాశాలున్నాయి. వాటి గురించి తెలియాలంటే డైవింగ్‌పై అవగాహన పెంచుకోవాలి."-రిచామాలిక్, స్కూబా ఇన్‌స్ట్రక్టర్
"మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును అందించే సముద్రాలు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల కారణంగా కలుషితం అవుతున్నాయి. సంద్రపుజలాలు వేడెక్కడం వల్ల కడలి నాచు అంతరించిపోతుంది. డైవర్లుగా మాకు ఆ పరిస్థితి తెలుసు. సముద్ర వ్యర్థాల్ని తొలగించాలంటే డైవర్ల సంఖ్య చాలా వరకు పెరగాలి. దానికోసం తగిన శిక్షణ తీసుకుని డైవర్లుగా రాణిస్తే, పర్యావరణాన్ని రక్షించిన వాళ్లమవుతాం."-నీలాభాస్కర్, కేవ్ డైవర్
సముద్రంలో ముళ్లబంతులు- పర్యావరణానికి చాలా డేంజర్- పైలట్ ప్రాజెక్ట్‌తో తొలగింపు!