GHMC Summer Coaching Camps for Children : సమ్మర్ అంటేనే పిల్లలకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రత్యేక సమయం అని చెప్పవచ్చు. వేసవిలోనే వివిధ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. రెండు నెలల సమయాన్ని వృథా చేసుకోకుండా ఉండేందుకు, భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా కొత్త కోర్సులను నేర్చుకునేందుకు వేసవి ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పిల్లలకు ఇష్టమైన అంశాల్లో శిక్షణ ఇప్పిస్తుంటారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి వాటి పట్ల ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అందుకే గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ ప్రత్యేక సమ్మర్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది కూడా 6 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు 37 రోజుల పాటు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ప్రారంభించింది. ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక క్రీడ ప్రాంగణాల్లో క్రీడలు నిర్వహిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు.
GHMC Summer Camp Events : ఏటా హైదరాబాద్ నగరంలో వివిధ రకాల క్రీడల్లో ప్రత్యేక సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా 44 క్రీడల్లో సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. క్యాంప్‌లకు అవసరమైన స్పోర్ట్ మెటీరియల్‌ను ఆయన పరిశీలించారు. ఈ క్యాంప్ కోసం ప్రత్యేకంగా ట్రెయినేర్స్ను ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి 9 వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇస్తారు.
సమ్మర్ కోచింగ్ క్యాంప్ కోసం 10 నుంచి 100 రూపాయల దాకా రుసుములు వసూలు చేస్తారు. ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. షటిల్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్ బాల్, కరాటే, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగా, క్యారమ్, చెస్, స్విమ్మింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా వేసవి కాలంలో నిర్వహించే సమ్మర్ క్యాంప్స్ వల్ల పిల్లల క్రీడల పట్ల ఆసక్తి పెరగటమే కాకుండా శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
పిల్లలు ఇలా సమ్మర్‌లో క్యాంప్‌లో చేరితే ఉత్సాహంగా కొత్తగా ఏమైనా నేర్చుకుంటారని, దీని వల్ల వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుంచి మే 20 తేదీ వరకు 30 రోజుల పాటు ఉచిత క్రికెట్ శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన క్యాంప్స్ నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు తెలిపారు.