Gas Leak at Jawaharlal Nehru Pharma City of Parawada : పరవాడ ఫార్మాసిటీలోని ఓ పరిశ్రమలో విషవాయువు లీకై ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో 8 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ లీకేజీ ఘటనలో కార్మికులు తీవ్ర అస్వస్ధతకు గురికావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు అందుతున్న చికిత్సపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
400 లీటర్ల హెచ్సీఎల్ లీక్ : అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గ్యాస్ లీకేజి జరిగి ఓ కార్మికుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం కంపెనీ ఉత్పత్తి కర్మాగారంలో రియాక్టర్-కమ్-రిసీవర్ ట్యాంక్ నుంచి 400 లీటర్ల హెచ్సీఎల్ లీక్ అయ్యింది. సమీపంలోని 9 మంది కార్మికులు దగ్గు, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడటంతో వారిని హుటాహుటిన కంపెనీ యాజమాన్యం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. ఇవాళ మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడిస్సాకి చెందిన అమిత్ అనే కార్మికుడు మృతి చెందాడు.
యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటాం : గ్యాస్ లీకేజ్ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం చేయాలన్న చంద్రబాబు, బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.
గ్యాస్ లీకేజ్ ఘటనపై విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పందించారు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినా కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాద కారకులు, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఘటనపై విచారణ జరపాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అధికారుల్ని అదేశించారు.
ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నాం : ఇవాళ మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన అమిత్ అనే కార్మికుడు మృతి చెందినట్టు కలెక్టర్ విజయ్ కృష్ణన్ వెల్లడించారు. మరో ఇద్దరికి వెంటిలేటరుపై చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించాలని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌ని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటన స్థలంలోని సీసీటీవి ఫుటేజీ సేకరించి ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నట్టు వివరించారు.
కోటి రూపాయిల పరిహారం ఇవ్వాలి : యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాద వివరాలు బయటకు రాకుండా యాజమాన్యం దాచిపెడుతుందని ఆరోపించాయి. మృతుడి కుటుంబానికి కోటి రూపాయిల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
పరిశ్రమలో గ్యాస్ లీక్ - 50 మందికి తీవ్ర అస్వస్థత! - GAS LEAK in AP