Police Stations Dividing Problems in AP : జిల్లాల పునర్విభజనలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సమస్యగా మారాయి. శాస్త్రీయత లేకుండా అసంబద్ధంగా పోలీసు యూనిట్లను విభజించారు. ఫలితంగా గతంలో నగర కమిషనరేట్‌లో ఉన్న గన్నవరం, పెనమలూరు స్టేషన్లు కృష్ణా పోలీసు పరిధిలోకి వెళ్లాయి. దీంతో విజయవాడ శివారు స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు పేట్రేగిపోవడానికి కారణమవుతోంది.
వీఐపీల భద్రతలో రెండు యూనిట్ల మధ్య సమన్వయం ఉండడం లేదు. ఈ లోపాలను సరిదిద్దేందుకు ఇటీవల విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు విలీనం ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ స్టేషన్లను కమిషనరేట్‌లో కలపాలని కోరారు. దీనిపై త్వరలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధి ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది.
గన్నవరం, పెనమలూరు పోలీస్ స్టేషన్‌లు గతంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత కృష్ణా జిల్లాలోకి వెళ్లాయి. ఫలితంగా వీఐపీ బందోబస్తు ఏర్పాట్లు, శాంతి, భద్రతల విషయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రెండు సర్కిళ్లు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంకు 60 కి.మీ దూరంలో ఉన్నాయి. విమానాశ్రయం కూడా కృష్ణా పోలీసు పరిధిలోకి వచ్చింది. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రముఖుల భద్రత విషయంలో సమన్వయ లోపం తలెత్తుతోందని ఉన్నతాధికారులు గుర్తించారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు మండలంలోని పోరంకిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్, తన అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్ద హల్‌చల్ చేశారు. పోలీసుల కళ్ల ముందే వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. అరకొర సిబ్బందినే మోహరించడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో అక్కడి ఎస్పీ, అదనపు సిబ్బంది వచ్చే సరికి అంతా సద్దుమణిగింది. జోగి అనుచరులు విచ్చలవిడిగా రాళ్ల దాడి చేసినా, కట్టెలు పట్టుకుని హల్‌చల్ చేసినా సమర్థంగా నియంత్రించలేకపోయారు.
గత ఏడాది జూన్‌లో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గన్నవరం మండలం కేసరపల్లిలో నిర్వహించారు. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, తదితర ప్రముఖులు విజయవాడ నగరం నుంచి కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు పోలీసుల యూనిట్ల మధ్య సమన్వయ లోపంతో వేడుకలకు హాజరయ్యేందుకు వేదిక వద్దకు రాకుండానే వీఐపీలు, అధికారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చంద్రబాబుతో ప్రమాణస్వీకారం చేయించాల్సిన గవర్నర్ కాన్వాయ్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది.
గన్నవరం విమానాశ్రయం, పెనమలూరు, విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ నుంచి బలగాలు కేవలం 15 - 20 నిమిషాల్లో చేరవచ్చు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుంచి రావడానికి కనీసం గంట నుంచి గంటన్నర వరకు పడుతోంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం అనేక మంది వీఐపీలు రాకపోకలు సాగిస్తుంటారు. మరోవైపు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. అదనపు బలగాలు తక్షణం అవసరమయ్యే పరిస్థితుల్లో విజయవాడ నుంచి వేగంగా పంపేందుకు అవకాశం ఉంటుంది.
పెనమలూరులో భారీగా కార్మికులు, విద్యార్థులు, పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. విజయవాడ నగర శివారు ప్రాంతం కావడంతో కానూరు, పోరంకి, తాడిగడప, పెనమలూరు ప్రాంతాల్లో ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గన్నవరం మరియు పెనమలూరు స్టేషన్ల పరిధిలో తరచూ వీఐపీల రాకపోకలు ఉంటున్నాయి. వీరిలో దాదాపు అందరూ విజయవాడ, అమరావతికి వెళ్లాల్సిన వారే ఉంటారు. కమిషనరేట్ పరిధిలో వీటిని ఉంచడం ద్వారా బందోబస్తు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ సులభతరం అవుతుంది. గన్నవరం, పెనమలూరు ప్రాంతాలను కృష్ణా పోలీసు యూనిట్ పరిధిలో ఉంచడం వల్ల సమన్వయం లోపం తలెత్తుతోంది.
ఇవాళ తప్పు చేసి రేపు తప్పించుకోగలరా? - ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
కమిషనరేట్ పరిధిలోని నగర బహిష్కరణకు గురైన వారు ఈ స్టేషన్ల పరిధిలో తలదాచుకుంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లు రెవెన్యూ జిల్లా పరిధికి సంబంధం లేకుండా సరిహద్దులు నిర్ణయించారు. పరిపాలనా అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటి పరిధి ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించింది. ఈ రెండు పీఎస్‌లను ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోకి తీసుకువస్తే వీఐపీ కార్యకలాపాలకు సమన్వయం సులభతరం అవుతుంది. అవాంచనీయ ఘటనలు ఎదురైతే సత్వరమే నియంత్రించేందుకు వీలు కలుగుతుంది.
కోర్టును మోసం చేయాలనుకుంటే మూల్యం చెల్లించాల్సిందే - ఎస్సై అభ్యర్థులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం