Women Entrepreneur Ganji Aruna Success Story : మధ్యతరగతి కుటుంబం, డిగ్రీ వరకే విద్యాభ్యాసం, చిన్న వయసులోనే వివాహం, ఆ వెంటనే కుటుంబ సమస్యలు. ఐనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో ముందడుగేశారు. కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా ఆర్థిక పరిస్థితులు మెరుగ్యయాక సొంతంగా ఇంట్లోనే చిన్నపట్టుదారం పరిశ్రమను ప్రారంభించారు. ఆమె ఆలోచనలకు అనుగుణంగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపారం, కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది.
దాంతో పాటు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు ఈ మహిళా వ్యాపారవేత్త. ఈ క్రమంంలో అనేక ఒడుదొడుకులను సునాయాసంగా ఛేదించి, తన ప్రతిభను నిరూపించుకొని ముందుకుసాగుతున్నారు. ఆమెనే గంజి అరుణ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ స్వస్థలం. కుటుంబ పరిస్థి తులతో డిగ్రీలోనే చదువుకు స్వస్థి చెప్పింది. అరుణకు 2003లో శ్రీహరితో వివాహమైంది. చేనేత కుటుంబానికి చెందిన అత్తింటివారు మగ్గాలు నేసేవారు. కాగా పెళ్లైన కొన్నాళ్లకి శ్రీహరి తండ్రి మరణించారు.
పట్టుగూళ్ల నుంచి నాణ్యమైన పట్టుదారం ఉత్పత్తి : ఆ సమయంలో వారింట్లో 100కు పైగా పట్టు మగ్గాలుండేవి. వాటికి పెద్ద మొత్తంలో పట్టుదారం అవసరమయ్యేది. దాన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చేవారు. మిగిలింది బయట అమ్మేవారు. బెంగళూరు నుంచి కొనుగోలు చేసే పట్టుదారం కూడా నాణ్యంగా ఉండకపోవడంతో అరుణ సొంతంగా పట్టు పరిశ్రమను స్థాపించి దారం తయారు చేద్దామని భర్తకు సలహా ఇచ్చారు. దాంతో మెుదట లక్ష రూపాయలతో ప్రారంభించినట్లు గంజి అరుణ చెబుతున్నారు.
Krishna Reeling and Twisting Unit in Choutuppal : అరుణ భర్త శ్రీహరి చిన్ననాటి నుంచి మగ్గం నేసేవారు. దీంతో ఈయనకి మగ్గాలపై, దారాలపై మంచి అవగాహన ఉండేది. వీరికి అవసరయ్యే పట్టుదారాల పరిశ్రమలు అప్పట్లో జనగామలో తప్ప తెలంగాణాలో ఎక్కడా ఉండేవి కావు. పట్టుదారాలు తీసే పరిశ్రమల్లేవు. దాంతో తాము సొంతంగా పట్టుపురుగుల నుంచి పట్టుదారం తయారు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. చేతిలో సరిపడినంత డబ్బు లేకపోవడంతో 3 లక్షల రూపాయలకు పైగా అప్పు చేసి ఇంట్లోనే చిన్నగా ట్విస్టింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.
ట్విస్టింగ్ యూనిట్‌కి అవసరమైన ముడిసరకును బెంగళూరు నుంచి తెచ్చి రోజుకు 23 కేజీల పట్టు, వార్పు తీసేవాళ్లు. చౌటుప్పల్‌కు దగ్గర్లో ఉండటం, నాణ్యమైన దారం, తక్కువ ధరకే ఇవ్వడంతో చుట్టుపక్కలు వాళ్లంతా వచ్చి కొనుగోలు చేయడంతో, అలా వ్యాపారాన్ని క్రమంగా పెందుకుంటూ వెళ్లామని అరుణ చెబుతున్నారు. నాణ్యతతో అరుణ దంపతులు తయారు చేసిన పట్టుదారానికి డిమాండ్ బాగా పెరిగింది.
ఆలోచనలకు అనుగుణంగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపారం : అనుకున్నట్లుగానే కొనుగోళ్లు అధిక స్థాయిలో జరిగాయి. దీంతో వ్యాపారాన్ని విస్తరించాలని భావించిన అరుణ, తన భర్తతో కలిసి 2016లో చౌటుప్పల్‌లో ఎకరంన్నర స్థలంలో కృష్ణ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ పరిశ్రమను నిర్మించారు. దాంతో క్రమంగా పట్టుదారం ఉత్పత్తి పెరిగింది. అలా మొదట్లో రోజుకు 23 కేజీలు మాత్రమే ఉత్పత్తయ్యే పట్టుదారం నేడు, 100కేజీల వరకు వస్తుంది.
ఫలితంగా ఏడాదికి రూ.3కోట్ల వరకు టర్నోవర్ సాధిస్తున్నట్లు గంజి అరుణ చెబుతున్నారు. అంతేనా కృష్ణరీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్‌లో 60మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. అందులోనూ అధికంగా మహిళలే ఉండటం ప్రత్యేకం. ఈ ప్రయాణంలో అనేక ఒడుదొడుకులు ఎదురయ్యాయని వాటిని దాటుకుని ముందుకు వెళ్తున్నట్లు ఆమె చెబుతున్నారు. అరుణ భర్త శ్రీహరి పదో తరగతి వరకే చదువుకున్నారు. భార్య అరుణ మొదట వ్యాపారం చేద్దామంటే శ్రీహరి ఆలోచనలో పడ్డారు. మనవల్ల అవుతుందా అని సంకోచించారు.
60మందికి ఉపాధి కల్పిస్తున్న గంజి అరుణ : అప్పుడు అరుణ ధైర్యంగా ముందడుగు వేసి, వ్యాపారంలోకి రావడంతో ఇంత పెద్ద సంస్థను నిర్వహిస్తున్నామని శ్రీహరి చెబుతున్నాడు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడలేదని చెబుతున్నారు. తమ ప్రయత్నానికి అనుగుణంగా బ్యాంకులు కూడా సబ్సీడీ ఇచ్చాయంటున్నారు. దీంతో పాటు మెషనరీకి సెరికల్చర్ శాఖ రాయితీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో రాణించాలని అరుణ సూచిస్తున్నారు.
తాను ఒక వైపు వ్యాపారం, మరో వైపు పిల్లలు, కుటుంబ బాధ్యతలు అన్నింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు అరుణ. తనకొచ్చిన ఆలోచనతో ఓ వైపు కుటుంబ వృత్తిని కొనసాగిస్తున్న అరుణ, మరోవైపు మహిళా వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, పరిశ్రమ నిర్వహణను సమన్వయంతో నిర్వహిస్తున్నారు. పరిశ్రమ ద్వారా 60మందికి పైగా ఉపాధి కల్పిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూత అందిస్తున్నారు.