Gang War in Yanamalakuduru Krishna District : కృష్ణా జిల్లా యనమలకుదురు ప్రాంతంలో పూర్తిగా మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన యువత ఎక్కువగా ఉన్నారు. అనేక మంది రౌడీ షీటర్లు ఈ ప్రాంతం వారే. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ ప్రాంతంలో నివసించే సామాన్యులు నిత్యం భయాందోళన గురవుతున్నామని తెలుపుతున్నారు.
అటువంటి ప్రాంతమైన యనమలకుదురు పోలీస్ అవుట్ పోస్టుకు చాలాకాలంగా సిబ్బంది కొరతతో తాళం వేసి ఉంచుతున్నారని స్థానికులు తెలిపారు. ఈనెల ఐదో తేదీన రాత్రి పలువురు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కూడా పోలీసు ఔట్ పోస్టు ఎదురుగానే జరిగింది. సమాచారం అందుకున్న పోలిసులు అక్కడికి చేరుకునే సమయానికి గొడవ తారా స్థాయికి చేరిందని స్థానికులు వివరిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.
అసలేెెం జరిగిందంటే : కృష్ణా జిల్లాలోని యనమలకుదురులో మంగళవారం అర్ధరాత్రి యువకుల మధ్య గ్యాంగ్‌వార్ బీభత్సం సృష్టించింది. కొంతకాలంగా రెండు గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు చాపకిందనీరులా ఉండగా మంగళవారం రాత్రి ఒక్కసారిగా బయటపడింది. దాడులు, ప్రతిదాడులకు తెగబడడంతో ఈ ప్రాంతం దద్ధరిల్లింది. దాడుల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తుండగా పలువురు కత్తిపోట్లకు గురయ్యారు. కత్తులు, చాకులు, బీరు సీసాలతో పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. దాడులు ప్రారంభమైన పది నిమిషాల్లోనే పోలీస్ ఇంటర్ సెక్టార్ మొబైల్ అక్కడకు చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కత్తిపోట్లకు గురైన వారు ఆసుపత్రి పాలయ్యారు.
అప్పుడు అధికారం - ఇప్పుడు అహంకారం- మారని వైఎస్సార్సీపీ నేతల వైఖరి
పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు వశిష్ట కాలనీకి చెందిన గుడివాక రాహుల్‌కు తాడిగడప చెరువు కట్ట ప్రాంతంలో నివసించే పెదపూడి మనోజ్‌కుమార్ అలియాస్ టోనిల మధ్య కొంతకాలంగా వివాదాలు నెలకొన్నాయి. రాహుల్ ఇంటర్ తప్పి కంప్యూటర్ కోర్సులు నేర్చుకొంటున్నాడు. టోని నగర సమీపంలో ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. ఇద్దరూ కొందరు యువకులతో వర్గాలను నడుపుతుండగా కొంత కాలంగా వీరి విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఈ నెల 3వ తేదీన రెండు వర్గాల ఘర్షణ జరిగింది. అప్పటికి గొడవ సద్దుమణిగిందనుకుంటే మంగళవారం రాత్రి వీరి మధ్య మరోసారి వివాదాలు జరగడంతో రెండు వర్గాలు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని యనమలకుదురు పెట్రోలు బంకు వద్దకు రావాలంటూ రెచ్చగొట్టుకొన్నారు. చంపేస్తామంటూ సవాళ్లు విసురుకొంటూ అక్కడకు చేరుకొన్నారు. వెంట చాకులు, కత్తులు, బీరుసీసాలు తీసుకురాగా రెండు గ్యాంగులకు చెందిన 20 మంది వరకు పరస్పరదాడులకు పాల్పడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం పెనమలూరు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేసుకొన్నారు. దాడుల్లో టోని, సంతోష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ వర్గానికి చెందిన మనోజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు సతీష్, విన్ను, ప్రేమ్, బుడియ్య, దర్శి వెంకటసాయికుమార్, రవితేజ, ఉప్పెర్ల సాయికుమార్, జగదీష్, మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. అలాగే మరో వర్గానికి చెందిన గుడివాక రాహుల్ ఫిర్యాదు మేరకు మనోజ్ అలియాస్ టోని, కిరణ్ అలియాస్ ఘని, సంతోష్, చందు, భాగ్యరాజ్, దినేష్ అలియాస్ పండు, మరికొంత మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నిందితుల్లో కొందరు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు చెందిన వారున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిలో 9 మంది అరెస్టు చేయగా పరారీలో ఉన్నవారి కోసం ఓ ప్రత్యేక బృందం గాలిస్తోంది.
మారణాయుధాలతో వైఎస్సార్సీపీ నేతల దాడి - టీడీపీ కార్యకర్త దారుణహత్య