Ganesh Chaturthi Festival Celebration 2024 : రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గల్లీలో వినాయక చవితి పండుగ సందడి మొదలైంది. భాగ్యనగరంలోని అన్ని మార్కెట్లలో ఆకట్టుకునే వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. పండుగ సమీపిస్తుండటంతో పలువురు బొజ్జ గణపయ్యల తయారీకి పెట్టింది పేరైన ధూల్‌పేట నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించే వారు పెద్ద మొత్తంలో ప్రతిమలు తీసుకెళ్తున్నారు.
Ganesh Chaturthi Festival Start : రాష్ట్రంలో చవితి సందడి షురూ అయ్యింది. పల్లె, పట్నం తేడా లేకుండా చిన్నాపెద్దా కలిసి జరుపుకునే గణపతి నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. మార్కెట్లలో వివిధ రూపాలతో వినాయక విగ్రహాలు కొలువుతీరాయి. పండక్కి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో హైదరాబాద్‌లోని మార్కెట్లన్నీ గణేశుడి ప్రతిమలతో కిటకిటలాడుతున్నాయి. వినాయక విగ్రహాలకు పెట్టింది పేరైన ధూల్‌పేట్‌లో 3 నెలల ముందు నుంచే విక్రయాలు మొదలయ్యాయి.
పండుగ దగ్గర పడుతుండటంతో ఆ ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. ఇతరుల కంటే తమ గణేశుడు అందంగా పెద్దగా, ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారి ఆసక్తికి తగ్గట్లుగానే ఏటా మార్కెట్లలో తీరొక్క థీమ్‌లతో బొజ్జ గణపయ్యల ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. ఈసారి రామ్‌లల్లా, శివాజీ గణేశ్, గరుడ గణేశ్, దగడ్ గణేశ్, మహారాష్ట్ర ఫేమస్ గణేశ్ ఇలా రకరకాల థీమ్‌లతో గణేశ్ విగ్రహాలు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.
Ganesh Idols Making In Dhoolpet 2024 : పండుగకు ఆరు నెలల ముందు నుంచే ధూల్‌పేట్‌లో గణేశ్ విగ్రహాల తయారీ ప్రారంభమవుతుంది. వేరే రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించి చక్కగా తయారు చేయించటం, రంగులద్దటం వంటి పనులు పూర్తి చేస్తుంటారు. విగ్రహాల తయారీపైనే ఆధారపడి వేల కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. భారీ ప్రతిమలు తయారు చేసి, చిన్న విగ్రహాలను షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రజల ఆసక్తికి అనుగుణంగా రకరకాల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి, విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చి విగ్రహాలు తీసుకెళ్తున్నారని అమ్మకందారులు చెబుతున్నారు. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయకులను పూజించాలని ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు చెబుతున్నాయి. అయితే మార్కెట్‌లో చిన్న చిన్న విగ్రహాలనే మట్టితో చేసినవి విక్రయిస్తుండటం వల్ల వాటి వైపు వెళ్లడం లేదని కొనుగోలుదారులు చెబుతున్నారు. పండుగకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో రానున్న రోజుల్లో విక్రయాలు జోరందకునే అవకాశం ఉంది.