Gadwal MLA Krishna Mohan Reddy joined Congress : తెలంగాణ రాష్ట్రం గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూడు రోజుల క్రితం కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో జులై 6వ (నేడు) తేదీన చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో స్థానిక గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway
ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తున్న స్థానిక నేతలు : రెండు రోజులుగా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సరితా తిరుపయ్య, ఆమె అనుచరులకు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరొక వైపు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ కూడా సరితా తిరుపతయ్యతో ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పారు. ఈరోజు కూడా గద్వాల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై వారందరికి నచ్చ చెప్పిన తర్వాతనే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సీఎం రేవంత్ నివాసంలో కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరిన సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒక్కొక్కరిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నేతలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదు. స్థానిక పరిస్థితులు, నేతల మధ్య ఉన్న వైరం, అభివృద్ధి కోసం నిధులు తదితర కారణాలతో నేతలు కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు.
ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, వారి దారిలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సైతం నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరింది. త్వరలోనే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీఎస్‌ఆర్టీసీ కష్టాలు తీరేనా - ఉమ్మడి ఆస్తుల్లో వాటా దక్కేనా - APSRTC Losses State Bifurcation
భాగ్యనగరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం - భారీగా తరలివచ్చిన పసుపుదళం - CHANDRABABU RALLY IN HYDERABAD