Gadwal Dust Collection Issues : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పురపాలిక కంపు కొడుతోంది. ఇంటింటి నుంచి సేకరించి డంపింగ్ యార్డుకు చేరాల్సిన చెత్త వీధుల్లో, కూడళ్లలో కుప్పులుగా పేరుకుపోతోంది. గద్వాల పట్టణంలో ఐదారు రోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులున్నాయి. ఈ వార్డుల్లోంచి ఇంటింటికీ చెత్త సేకరించాల్సిన బాధ్యతను 6 నెలల కిందట మున్సిపాలిటీ నుంచి ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. చెత్త సేకరించినందుకుగానూ ఇంటికి రూ.60 వసూలు చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ పట్టణ ప్రజలు పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
"మా ఇళ్ల నుంచి రోజు చెత్త తీసుకుపోవడం లేదు. రెండు మూడు రోజులకోసారి వచ్చి తీసుకెళ్తున్నారు. దీంతో అందరూ చెత్తను రోడ్లపై వేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.60 తీసుకుంటున్నారు. ఇక్కడ చెత్త పారేయటం వల్ల డ్రైనేజీలు నిండిపోతున్నాయి. డబ్బులు అందరూ కట్టలేకపోతున్నారు." - స్థానికులు
కొన్నిచోట్ల ఇంటికి రూ.100, కొన్నిచోట్ల రూ.60 నుంచి రూ.90 ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చినా సరైన సేవలు అందకపోవడంతో పన్ను చెల్లించేందుకు ప్రజలు నిరాకరించారు. దీంతో ప్రైవేటు ఏజెన్సీ ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరణ ఆపేసింది. జనం ఇంట్లో పోగయ్యే చెత్తను వీధులు, కూడళ్లలో ఎక్కడపడితే అక్కడ వదిలేస్తున్నారు.
ఎండ తీవ్రత ఎఫెక్ట్ - డంపింగ్ యార్డ్‌లో మంటలు - Fire Incident at Medak Dumping Yard
"కలెక్టర్ ఆదేశాల మేరకు చెత్త సేకరణ ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి కూడా చెత్త సేకరణ సరిగ్గా చేయలేదు. ప్రజలను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారని తెలిసింది. కలెక్టర్‌తో మాట్లాడాము. మళ్లీ మున్సిపాలిటీనే చెత్తను తీసుకెళ్తుంది." - బీఎస్.కేశవ్, మున్సిపల్ ఛైర్మన్, గద్వాల
క్షమాపణలు తెలిపిన మున్సిపల్ ఛైర్మన్ : పట్టణంలో ఏర్పడిన పరిస్థితిపై మున్సిపాలిటీ పాలక వర్గం ఎట్టకేలకు స్పందించింది. గతంలో ఉన్నతాధికారుల సూచనతో చెత్తసేకరణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించామని, ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని మున్సిపల్ ఛైర్మన్ కేశవ్ చెప్పారు. తిరిగి పాలకవర్గం తీర్మానం చేసి మున్సిపాలిటీకే చెత్తసేకరణ బాధ్యతను అప్పగిస్తామని వెల్లడించారు. ఇబ్బంది పెట్టినందుకు గద్వాల పుర ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. చెత్తపై పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తక్షణం ఇంటింటికీ చెత్తసేకరణ చేపట్టాలని గద్వాల పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Sarpanch Cleaned Sewer : మురుగని వెరవలేదు.. తన బాధ్యతను మరవలేదు