CM Revanth On Free Power For Ganesh Pandals : గణేశ్ ఉత్సవాలపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఉచిత కరెంట్ కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరున్న హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచేలా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కోరారు. ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గతేడాది గణాంకాల ప్రకారం పరిశీలిస్తే ఓఆర్ఆర్ లోపల లక్షన్నర విగ్రహాలు ఏర్పాటు చేశారని ముందుగానే అనుమతి తీసుకుంటే ట్రాఫిక్ సహా ఇతర ఇబ్బందులు తలెత్తవన్నారు.
ఆ విషయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటిస్తాం : హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరంలోని ఇతర జలాశయాల్లోనూ నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఏయే ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారో ముందుగానే సమాచారం ఇస్తే ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుందన్నారు. వినాయక నిమజ్జనం జరిగే సెప్టెంబరు 17న 'అనంత చతుర్దశి' ఉందని దాని ప్రాముఖ్యతను తెలిపే సాహిత్యాన్ని ప్రచురించాలని భాగ్యనగర ఉత్సవ సమితి కోరగా ఏర్పాట్లు చేయాలని దేవదాయ శాఖను సీఎం ఆదేశించారు. డీజేలకు అనుమతివ్వాలని ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ కోరగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. సుమారు 25వేల మందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు.
CM Revanth Review On Milad Un Nabi : మిలాద్ ఉన్ నబి ఏర్పాట్లపైన సీఎం సమీక్షించారు. గణేశ్ ఉత్సవాలు ఉన్న దృష్ట్యా వచ్చే నెల 16న జరిగే మిలాద్-ఉన్-నబి ప్రదర్శనల్ని 19వ తేదీకి వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరగా మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహమ్మద్ ప్రవక్త 1500వ జయంతి వేడుకల్ని 2025లో ఏడాదిపాటు నిర్వహించేందుకు అనుమతివ్వాలని మిలాద్ కమిటీ సభ్యులు కోరగా నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు : సీఎం రేవంత్ రెడ్డి