AP Free Gas Cylinder Scheme Updates : ఏపీలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా అమలు చేయనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లు ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఉదయం పది గంటల నుంచే వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్‌ల కోసం బారులు తీరారు. ఈ పథకం ద్వారా నాలుగు నెలలకొకటి చొప్పున ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందించనుంది.
నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మొదటి సిలిండర్ బుకింగ్స్ ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ నెల 31 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిలిండర్లను డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీనిని పొందేందుకు ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు సమర్పించాలని సర్కార్ సూచించింది.
Free Gas Cylinder Bookings Start : సిలిండర్ బుకింగ్ నమోదు అయినట్టుగా లబ్ధిదారుల ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందనుంది. బుకింగ్ అయిన 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా హెచ్పీసీల్, ఇండియన్ ఆయిల్ , భారత్ పెట్రోలియం కంపెనీలతో ప్రభుత్వం ఇప్పటికే సర్కార్ చర్చలు జరిపింది. సిలిండర్ అందించిన క్షణం నుంచి 48 గంటల్లోపు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. మరోవైపు రూ.895 కోట్లు ఆయిల్ కంపెనీలకు అందించేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డీబీటీ విధానంలో ఈ నగదును పౌరసరఫరాల శాఖ అందిచనుంది.
అక్టోబర్ 31 నుంచి 2025 మార్చి 31 లోపు తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం ఉంది. రెండో విడతలో ఏప్రిల్ 1 నుంచి జులై 30 వరకూ, మూడో విడతలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకూ , నాలుగో విడత 2025 డిసెంబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఇచ్చింది. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి 2,684 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పట్టణాల్లో 24 గంటల్లో, పల్లెల్లో అయితే 48 గంటల్లోనే సిలిండర్ అందించే ఏర్పాటు చేసింది.
రేపు పథకాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు : ఈ పథకం ద్వారా 1.40 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో మొదటి సిలిండర్‌ను ఆయన స్వయంగా అందించనున్నారు.