Free Fish Seeds Distribution in Telangana : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి జరిగే ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మత్స్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభం కానుంది.
జిల్లాల్లో ప్రారంభించనున్న మంత్రులు : ఆయా ప్రాంతాల్లో జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగిలిన 23 జిల్లాల్లో ఈ నెల 7న ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని మత్స్య శాఖ డైరెక్టర్ ప్రియాంక అల కోరారు.
Ponnam On Fish Seeds Free Distribution : ముఖ్యమంత్రి నాయకత్వంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. చెరువుల్లో నాణ్యమైన చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతిఏడాది సంబరంగా జరుగుతున్న చేపపిల్లల పంపిణీ గ్రామాల్లో ఒక పండగ వాతావరణంలో ఈసారీ జరగాలని సూచించారు.
మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలి : ఈ ఏడాది భారీ వర్షాలకి జలాశయాలు, చెరువులు, నీటివనరులన్నీ జలకళ సంతరించుకున్నందున మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారిన వేళ అన్ని చెరువుల్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఇవాళ్టి నుంచి చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల్లో ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
'మత్స్యకారులు జీవితాల్లో వెలుగు నింపుతున్న ఏకైక సర్కార్.. తెలంగాణ'