Fraud in the Name of Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎరవేసి నిరుద్యోగుల నుంచి ఓ ఐదుగురు సభ్యుల ముఠా లక్షలు దండుకున్న ఘటన ఏలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెం పరిసర మండలాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు నిరుద్యోగులు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని లబోదిబోమంటున్నారు. నిరుద్యోగులు ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేశారు.
రైల్వే టీసీ ఉద్యోగం: జంగారెడ్డిగూడెంలోని పుట్లగట్లగూడానికి చెందిన ఇబ్బ యామలరావు అనే వ్యక్తికి రైల్వే టీసీ ఉద్యోగమని 7,35,000 కాజేశారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయం వద్ద కొద్దిరోజుల శిక్షణ కూడా ఇచ్చారు. టీసీ యూనిఫామ్ కూడా వేయించి కార్యాలయం బయట మెట్ల మీద తిప్పేవారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినా ఉద్యోగంలో చేరేందుకు సమయం పడుతుందని చెప్పడంతో అనుమానం వచ్చిన ముఠా సభ్యులను యామలరావు నిలదీయడంతో వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే చాలాకాలం నుంచి వారి వెనక నగదు కోసం ఎంత తిరిగినా ఫలితం లేదని యామలరావు వాపోయారు.
ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం: అదే గ్రామానికి చెందిన కర్నాటి రాశి అనే యువతికి ప్రభుత్వం బ్యాంకులో ఉద్యోగం పేరుతో 7 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి నిరుద్యోగులను, మోసగాళ్లు బురిడీ కొట్టించారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినా బ్యాంకు నుంచి ఎటువంటి కబురు రాకపోవడంతో ముఠా సభ్యులను ఆమె నిలదీసింది. దీనితో ఆమె లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం - డబ్బులు తీసుకున్నాక పత్తా లేని లైఫ్ లైన్
ప్రభుత్వ శాఖల నకిలీ ముద్రలు: ఏలూరు జిల్లాలోని తదితర ప్రాంతాల్లో ముఠాల ఏజెంట్లు తిష్ట వేసి నిరుద్యోగులను వంచిస్తున్నారు. ముఠా నాయకుడు ఏలూరుకు చెందిన వ్యక్తిగా బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే తమ జీవితం బాగుంటుందన్న ఆశతో నిరుద్యోగులు అప్పులు చేసి మరీ లక్షల సమర్పిస్తున్నారు. రోజులు గడిచిన ఉద్యోగం రాకపోవడంతో నకిలీల వలలో చిక్కుకున్నామని గ్రహించి లబోదిబోమంటున్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారికి ఇవ్వాల్సిన ఉద్యోగాలను తాము ఈలా దొడ్డిదారిన ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులకు ఈ ముఠా ఆశ చూపించారు.
నిజమైన ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనట్లు గానే నిరుద్యోగులు నమ్మించేందుకు ఆయా ప్రభుత్వ శాఖల నకిలీ ముద్రలు, ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి బురిడీ కొట్టించారు. ఉద్యోగం కోసం పోలీస్ శాఖ నుంచి నోఅబ్జెక్షన్ లెటర్, ఇళ్ల వద్ద విచారణ, అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్న వారికి జూమ్ మీటింగులు, గ్రూప్ శిక్షణలు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
డోన్‌లో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Leaders Attack
పులస అ'ధర'హో - రూ.24 వేలకు అమ్మిన గంగపుత్రుడు - pulasa fish sold for rs 24 thousand