Cheating in The Name of Investment with High Profits: నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. వారి మాటలకు లొంగిపోతున్నట్లు కనిపించామా ఇక వాళ్ల మాటలకు అదుపే ఉండదు. మనల్ని ఎలాగైనా పెట్టుబడి పెట్టేలా ప్రేరేపిస్తారు. అంతే ఇక మనం వెనకా ముందు ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేశామా అంతే సంగతులు. ఈజీ మనీ కోసమో, త్వరగా సంపాదించాలనే ఆశతో వాళ్ల బుట్టలో పడి ఉన్నదంతా పోగొట్టుకుంటాం. ఇలాంటివి నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి.
మనుషుల అవసరాలను ఆసరాగా తీసుకుని రోజుకో మోసగాడు పుట్టుకు వస్తూనే ఉంటాడు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. పెట్టుబడి పేరుతో బాధితుల నుంచి 24 కోట్ల రూపాయలను కాజేశారు. డబ్బులను కాజేసిన నలుగురు నిందితులను హైదరాబాద్ ఆర్థిక నేర విభాగం (Economic Offences Wing) పోలీసులు అరెస్టు చేశారు.
INVESTMENT FRAUD IN HYDERABAD: బైబ్యాక్ పేరుతో 17 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 100 నెలల పాటు ప్రతి నెలా 30 వేల రూపాయలు ఇస్తామంటూ తొలుత నమ్మించారు. అంతే కాకుండా అదనంగా పలు ప్రాంతాల్లో స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తామంటూ సదరు వ్యక్తులు చెప్పారు. వీటికి తోడు ఆ భూమిలో గంధపు చెట్లు నాటి 13 నుంచి 15 ఏళ్ల తరువాత 50 శాతం వాటా ఇస్తామంటూ నమ్మబలికారు. అధిక డబ్బులు వస్తున్నాయి కదా అని పెట్టుబడి పెట్టేవారు కూడా ఎక్కువగా ఆలోచించలేదు. అదే సమయంలో మోసం చేసే వారు కూడా తెలివిగానే వ్యవహరించారు.
పెట్టుబడి పెట్టిన మొదటి రెండు నెలల పాటు చెప్పిన విధంగానే 30 వేల రూపాయల చొప్పున ఇచ్చారు. అయితే ఆ తర్వాత డబ్బులు చెల్లించడం ఆపేశారు. దీనిపై పెట్టుబడి పెట్టిన వారు ఆరా తీయగా, తాము మోసపోయామని గ్రహించారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. మొత్తంగా 120 మంది బాధితుల నుంచి 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.