Four Youth missing in River in Asifabad District : రంగుల పండుగ వేళ పలు జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. వివిధ చోట్ల ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇందులో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉండడం విషాదకరం. కుమురంభీం జిల్లాల్లో హోలీ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. ఇవాళ ఉదయాన్నే మిత్రులందరితో హోలీ సంతోషంగా జరుపుకున్న నలుగురు, అనంతరం జిల్లాలోని కౌటాల మండలం తాటిపెల్లిలో వార్ధా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో లోతు గమనించకుండా నదిలో దిగారు. కాగా నలుగురికి ఈత రాకపోవడంతో ఒకరికి వెనకాల మరొకరు నదిలో గల్లంతయ్యారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికుల సహాయంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఘటనా స్థలానికి కొద్దిదూరంలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరంతా కౌటాల మండలం నదీమాబాద్కు చెందిన సంతోశ్ కుమార్, ప్రవీణ్, సాయి, కమలాకర్గా గుర్తించారు. అందరూ 25 ఏళ్లలోపు యువకులే. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తెల్లవారుజామునే హోలీ ఆడుకోవడానికి సంతోషంగా వెళ్లిన తమ వారు విగతజీవులుగా మారడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు దండేపల్లి మండలం పతమామిడిపల్లికి చెందిన ఓ యువకుడు వాగులో స్నానానికి దిగి మృత్యువాతపడ్డాడు.
8th class student died after swimming in pond : మరోచోట ఓ 8వ తరగతి విద్యార్థి చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాతపడిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్గూడకు చెందిన మంద నరేశ్ కుమార్ (12) అనే విద్యార్థి ఆదివారం చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు, ఫైర్ సిబ్బందితో కలిసి సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.
సోమవారం తెల్లవారుజామున చెరువులో విద్యార్థి మృతదేహాం లభించింది. మృతుడు నరేశ్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పిల్లలను బావిలోకి తోసి తానూ దూకిన తల్లి - ఇద్దరు మృతి - Mother Committed Suicide