Four Policemen Suspended in Gambling Case : ప్రజలకు భద్రత కల్పించాల్సిన కొందరు పోలీసులు అడ్డదారి తొక్కుతున్నారు. కాసుల యావలో పడి అనవరసర కుటుంబ, ఆర్థిక వివాదాల్లో తలదూర్చుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీస్ ప్రతిష్ఠకే తీరని మచ్చ తెస్తున్నారు. దీంతో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్ వ్యవస్థలో కొందరి తీరు కంచే చేను మేసిన చందంగా మారుతోంది. తాజాగా జూదంలో పట్టుబడిన వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య నగదు విషయంలో తలెత్తిన వివాదం పోలీసుల చేతివాటాన్ని బయట పెట్టించి.. సీఐ, సబ్ ఇన్స్పెక్టర్ సహా నలుగురిని సస్పెన్షన్ చేయించింది.
ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీసుస్టేషన్ సర్కిల్ పెరవలి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గత సెప్టెంబరు 8న పెరవలి మండలం ముక్కామలలో ఓ పేకాట శిబిరంపై పెరవలి ఎస్సై అప్పారావు ఇద్దరు సిబ్బందితో దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులు సహా రూ.6.45 లక్షలు పట్టుబడ్డాయి. తర్వాత నిందితులు ఎస్సైతో బేరసారాలు కొనసాగించి, సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో రూ.55,000 స్వాధీనం చేసుకున్నామని కేసు నమోదు చేసిన ఎస్సై.. వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. స్వాధీనం చేసుకున్న రూ.లక్షల నగదు నిడదవోలు సీఐతో పాటు పెరవలి ఎస్సై సహా కొందరు సిబ్బంది మధ్య పంపకం జరిగింది.
జూదం పేచీ పోలీసులను పట్టించింది! : అయితే జూద శిబిరంపై దాడిచేసే సమయంలో నిందితుల్లో ఒకరు అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్‌కు పరిచయస్థుడు. దాడి నేపథ్యంలో అతడు లక్ష రూపాయలను కానిస్టేబుల్‌కు ఇచ్చి భద్రపరచమన్నాడు. ఈ సంగతి మిగతా సిబ్బందికి తెలియకుండా కానిస్టేబుల్ జాగ్రత్త పడ్డారు. మరోవైపు శిబిరంలో మిగతా సొమ్ము స్వాధీనం, కేసు నమోదు, నిందితులకు స్టేషన్ బెయిల్ చకచకా జరిగిపోయాయి. నిందితుడు కానిస్టేబుల్ వద్దకు తరువాత రోజు వెళ్లి తాను ఇచ్చిన రూ.లక్ష ఇవ్వాలని అడిగాడు.
ఆ మొత్తం పట్టుబడిన రూ.6.45 లక్షల్లో కలిసిపోయిందని కానిస్టేబుల్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రూ.లక్ష ఇచ్చిన వీడియో సీసీ కెమెరా ఫుటేజీని నిందితుడు బయట పెట్టాడు. క్రమక్రమంగా ఆ విషయం ఎస్పీకి చేరడంతో విచారణ జరిపి, నిడదవోలు సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్సై అప్పారావు, స్టేషన్ రైటర్ బుద్ధేశ్వరరావు, కానిస్టేబుల్ ఆర్.ఎల్లారావులను బాధ్యులుగా గుర్తించారు. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ మిగిలిన సిబ్బందిని శనివారం సస్పెండ్ చేశారు.
ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అవుతున్న ప్రజలు - ఆడేందుకు అడ్డదారులు