Gambling Case in Peravali : ప్రజలకు భద్రత కల్పించాల్సిన కొందరు రక్షకభటులు అడ్డదారి తొక్కుతున్నారు. కాసుల యావలో కుటుంబ, ఆర్థిక వివాదాల్లో తలదూర్చుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠకే మచ్చతెస్తున్నారు. దీంతో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్ శాఖలో కొందరి తీరు కంచే చేను మేసిన చందంగా మారుతోంది. తాజాగా జూదంలో పట్టుబడిన వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య నగదు విషయంలో తలెత్తిన వివాదం పోలీసుల చేతివాటాన్ని బయట పడేలా చేసింది. ఈ క్రమంలోనే సీఐ, ఎస్సై సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడదవోలు పోలీస్‌స్టేషన్ సర్కిల్ పెరవలి స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు గత సెప్టెంబర్ 8న పెరవలి మండలం ముక్కామలలో ఓ జూద శిబిరంపై పెరవలి ఎస్సై అప్పారావు ఇద్దరు సిబ్బందితో దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులు, రూ.6.45 లక్షలు పట్టుబడ్డాయి. తర్వాత నిందితులు ఎస్సైతో బేరసారాలు మొదలుపెట్టారు. దాంతో రూ.55,000 స్వాధీనం చేసుకున్నామని అప్పారావు కేసు నమోదు చేశారు. అనంతరం వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. స్వాధీనం చేసుకున్న రూ.లక్షల నగదు నిడదవోలు సీఐతో పాటు పెరవలి ఎస్సై, కొందరు సిబ్బంది మధ్య పంపకం జరిగింది.
Four Policemen Suspend in Nidadavole : అయితే జూద శిబిరంపై దాడిచేసే సమయంలో నిందితుల్లో ఒకరు అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్‌కు తెలిసిన వ్యక్తి. దాడి నేపథ్యంలో అతడు రూ.లక్షను కానిస్టేబుల్‌కు ఇచ్చి భద్రపరచమన్నాడు. ఈ విషయం మిగతా సిబ్బందికి తెలియకుండా కానిస్టేబుల్ జాగ్రత్త పడ్డారు. మరోవైపు శిబిరంలో మిగతా నగదు స్వాధీనం, కేసు నమోదు, నిందితులకు స్టేషన్ బెయిల్ చకచకా జరిగిపోయాయి.
నిందితుడు కానిస్టేబుల్ వద్దకు మర్నాడు వెళ్లి తాను ఇచ్చిన రూ.లక్ష ఇవ్వాలని అడిగాడు. ఆ మొత్తం పట్టుబడిన రూ.6.45 లక్షల్లో కలిసిపోయిందని కానిస్టేబుల్ చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటచేసుకుంది. దీంతో రూ.లక్ష ఇచ్చిన దృశ్యాల సీసీ కెమెరా ఫుటేజీని నిందితుడు బయట పెట్టాడు. ఈ విషయం కాస్తా ఎస్పీకి చేరడంతో విచారణ జరిపి, నిడదవోలు సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్సై అప్పారావు, స్టేషన్ రైటర్ బుద్ధేశ్వరరావు, కానిస్టేబుల్ ఆర్.ఎల్లారావును బాధ్యులుగా గుర్తించారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ సదరు సిబ్బందిని శనివారం సస్పెండ్ చేశారు.
రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్ - కేసు లేకుండానే యువకుడిపై దాడి - Guntur Police Violated Rules
ఈ పోలీసులేంటీ ఇలా అయిపోయారు బ్రో! ఐదుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు - AP Police Corruptions