Prof CR Rao Birth Celebrations at HCU : భారత్ శరవేగంగా ముందుకు దూసుకుపోతోందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. అదే సమయంలో అనూహ్యంగా జనాభా పెరుగుతోందని, ప్రతి రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ మాథ్యమాటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో జరిగిన పద్మవిభూషణ్ ప్రొఫెసర్ కల్యంపూడి రాధాకృష్ణారావు 104వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలుత ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ప్రొఫెసర్ కల్యంపూడి రాధాకృష్ణారావు ప్రతిమను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.బాలసుబ్రహ్మణ్యం, హెచ్‌సీయూ డైరెక్టర్ డా.ఎస్.వెంకటమ్మ, బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.యు.యుగంధర్, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ శైలజా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రఖ్యాత ప్రొఫెసర్ సీఆర్ రావు ప్రపంచం గర్వించదగ్గ ప్రఖ్యాంత గణాంక శాస్త్రవేత్త అని కొనియాడారు. సీఆర్ రావు ఒక మిషన్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని ప్రశంసించారు. ఆయన అడుగు జాడల్లో విద్యార్థులు నడవాలని సూచించారు. ప్రొఫెసర్ సీఆర్ రావు స్ఫూర్తి కొత్త తరాలకు అందించాలని అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, సంపదలో సమాన అవకాశాలు ఉండాలని ఆకాంక్షించారు. కానీ రాజకీయాలు కమీషన్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో రాజకీయాలు అంటే వ్యతిరేక భావనలు ఉన్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంక్షోభం, సామాజిక అసమానతలు సవాల్‌గా మారాయని అన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, డేటా విశ్లేషణ సాయంతో అధిగమించవచ్చని పేర్కొన్నారు.
హెచ్‌సీయూతో రామోజీ గ్రూపు కలిసి పని చేస్తోంది : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో కలిసి రామోజీ గ్రూపు పని చేస్తోందని మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్ వెల్లడించారు. బ్రిలియంట్ విద్యార్థులకు రామోజీ గ్రూపు నుంచి సాయం చేస్తామని ప్రకటించారు. సమాజంలో గణాంకాలు, విశ్లేషణలు మన జీవన గమనాన్ని సరళతరం చేస్తాయని స్పష్టం చేశారు. మన వద్ద ఉన్న డేటా చాలా శక్తివంతమైందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టాలు అంచనాలు వేసేందుకు గణాంకాలు ఉపకరిస్తాయని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వృద్ధి సాగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. హెచ్‌సీయూ విద్యార్థులు దేశానికి సేవలందించాలని శైలజా కిరణ్ దిశానిర్దేశం చేశారు.