New twist In Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆ కేసు విచారణాధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ఆరోగ్య రీత్యా ఇప్పట్లో అమెరికా వదిలి వెళ్లొద్దంటూ వైద్యులు సూచించినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, జూన్ 26న తాను భారత్‌కు రావాల్సి ఉన్నా ఆరోగ్యం బాగాలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన లేఖలో ప్రస్తావించారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను : గతంలో ఉన్న మలిగ్నెంట్ కాన్సర్‌తో పాటు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని ప్రభాకర్‌రావు లేఖలో తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, మీడియాకు లీక్‌లు ఇస్తున్నారని వాపోయారు. దీనివల్ల తనతో పాటు తన కుటుంబం కూడా మానసికంగా ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి అమెరికా నుంచి జూన్ 26వ తేదీనే రావాల్సి ఉండగా వైద్యుల సూచన మేరకు ఆగిపోయాని వెల్లడించారు.
విచారణకు సహకరిస్తాను : అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాక విచారణాధికారి ఎదుట హాజరై విచారణకు సహకరిస్తానని ప్రభాకర్ రావు చెప్పారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తానని వెల్లడించారు. కాగా భారత్‌కు వచ్చేంత వరకు వర్చువల్ విధానంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అలాగే ఒక ఉన్నతాధికారిగా తానెలాంటి తప్పు చేయలేదని లేఖలో స్పష్టం చేశారు. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు. టెలీకాన్ఫరెన్స్, మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.
'నేను క్రమశిక్షణ గల అధికారిని. నాపై ఆరోపణలు మాత్రమే వచ్చాయి. నేను తప్పకుండా విచారణ ఎదుర్కొంటాను. నేను ఎక్కడికీ తప్పించుకు పోలేదు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత భారత్ వస్తాను. ఈ విషయం గతంలోనూ పలుమార్లు ఉన్నతాధికారులకు చెప్పాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణాధికారికి చెబుతాను.' అని ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు.