Harish Rao Letter To CM Revanth on LRS Scheme : ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ఇప్పుడు అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రభుత్వం ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణమని మాజీమంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్‌రావు మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి ఉచితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు రుణమాఫీ కాక, రైతుబంధు రాక రైతన్నలు ఆవేదన చెందుతున్నారని, మరోవైపు విష జ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల పాలై, ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఇలాంటి ప్రధాన సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు నిత్యం ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని, ఫీజులు చెల్లించకుంటే లే అవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం రూ.15 వేల కోట్లు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వడం ప్రజల రక్త మాంసాలను పీల్చడమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి..
— Harish Rao Thanneeru (@BRSHarish) August 26, 2024
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, ఎల్ఆర్ఎస్ (భూముల క్రమబద్దీకరణ) పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఒకవైపు రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతన్నలు ఆవేదన చెందుతుంటే, మరోవైపు విషజ్వరాలతో సామాన్య ప్రజలు… pic.twitter.com/YT27JnXPPY
నాడు ఫ్రీ అని, నేడు ఫీజు అంటున్నారు : ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అని నాడు చెప్పి, ఇవాళ ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నాడు ఫ్రీ అని, నేడు ఫీజు అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు దాచుకున్న సొమ్మును నిలువునా దోచుకునే కుట్ర చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. అపుడు ఎల్ఆర్ఎస్‌కు ఫీజు వద్దని, ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే ఎల్ఆర్ఎస్తో దందా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అప్పుడు కట్టొద్దని, ఇప్పుడు కాటు వేస్తారా అని నిలదీశారు. ఎల్ఆర్ఎస్పై గతంలో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను లేఖలో పొందుపరిచారు.
ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా హైకోర్టుకు వెళ్లారని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టేలా బహిరంగ సభల్లో ఊదరగొట్టారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఎన్నికలు పూర్తి కాగానే మాట మార్చి ఎల్ఆర్ఎస్పై ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలపైన రూ.15 వేల కోట్ల మేర ఎల్ఆర్ఎస్ ఛార్జీల భారం వేయడం పాలనలో, హామీల అమలులో డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఎల్ఆర్ఎస్‌కు ఒక్క రూపాయి కూడా కట్టొద్దు : ప్రజా పాలన అని డబ్బా కొట్టుకుంటున్న వారికి పాతిక లక్షల దరఖాస్తుదారుల కుటుంబాల ఆవేదన కనిపించడం లేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీ ప్రకారం, పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. మాట తప్పిన ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఏ ఒక్కరూ ఒక్క రూపాయి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయించే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.