Venkat Reddy Remanded by ACB Court: గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వెంకటరెడ్డిని విజయవాడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు. అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించింది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గనుల లీజులో అక్రమాలు చేశారనే ఫిర్యాదుతో ఈ నెల 11న వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన అధికారులు, గురువారం అరెస్టు చేసి, విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపర్చారు.
ఈ కేసులో ఏ1గా వెంటరెడ్డి సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు గత ఐదేళ్లు సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచారని ఫిర్యాదులు వచ్చాయి. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2 వేల 5 వందల 66 కోట్ల రూపాయలు దోచేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి వెంకటరెడ్డి ఆచూకీ లభించలేదు. తాజాగా ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ - Venkata Reddy Arrest