KCR on BRS Future Plan : కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమవుతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని, తిరిగి గాడిలో పెట్టే దాకా తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత గురువారం సమావేశమయ్యారు. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు ఎలా గద్దె మీద కూర్చోబెట్టారో, అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ను ప్రజలు తిరిగి ఆదరిస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
గతంలో కంటే రెట్టింపు మద్దతుతో అధికారం ఇచ్చే రోజు త్వరలోనే వస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామని, ఇలాంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని వాపోయారు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని, చరిత్రలోకి వెళ్తే అర్థం అవుతుందని అన్నారు.
హామీలతో ఆగమాగం : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలు నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారన్న ఆయన, పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయిందని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు అందడం లేదని, తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా కావడం లేదని, ఇవన్నీ ప్రజల మనసుల్లో నమోదు అవుతున్నాయని కేసీఆర్ చెప్పారు.
ఆందోళన వద్దు : బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని, అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని నేతలు, కార్యకర్తలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకూ దిగజారుతోందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేదిపోయి, మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.
పార్టీ నాయకులను సృష్టిస్తుందని, నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారన్న ఆయన, కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు. బీఆర్ఎస్ ఫార్టీ బీఫాం ఇచ్చి అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారని కేసీఆర్ అన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి, తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్ - సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో - Ex CM KCR Drive a Car