Tiger Not Yet Been Found in Joint Adilabad District : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం అటవీ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అభయారణ్యం నుంచి మేటింగ్ కోసం వస్తున్న పెద్దపులులు, జనావాసాల్లోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తం కావాల్సిన అటవీ శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తుందని అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చే పెద్ద పులుల సంచారం ఆదిలాబాద్ జిల్లాలో హల్‌చల్ చేస్తుంటే, తాడోబా అటవీ ప్రాంతం ఉంచి వస్తున్న పెద్దపులులు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భయాందోళనలను సృష్టిస్తున్నాయి. నవంబర్ 30న కాగజ్‌నగర్ మండలం గన్నారంలో మోర్లే లక్ష్మిని హతమార్చిన పెద్దపులి, మరుసటి రోజు సిర్పూర్(టి) మండలం దుబ్బగూడలో పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతుపై దాడి చేసి గాయపరచడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఆ ప్రయత్నాలేవీ జరగట్లేదు : ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లోకి వస్తున్న మహారాష్ట్ర పులుల ఆచూకీని కనుగొనడంలో అటవీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. వాటి కదలికలను గుర్తించి, ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తూ, వాటిని కవ్వాల్ అభయారణ్యంలోకి దారి మళ్లించటంపై శాస్త్రీయ ప్రమాణాలు పాటించే ప్రయత్నాలు జరగటం లేదు. కనీసం తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పులి కదలికలు తెలిసే అవకాశం ఉంటుంది.
చీటీలో పేర్లు రాసి పంపాలి, ఆ తర్వాతే : ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందనే ఆవేదన ఆదివాసీల్లో వ్యక్తమవుతోంది. అటవీ, వన్యమృగాల సంరక్షణ, ప్రజల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధుల వినియోగంలోనూ అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుందనే ఆరోపణలకు తావిస్తోంది. పులుల భయంతో సాయం కోసం కార్యాలయాలకు వచ్చే ఆదివాసీలు, సందర్శకులను సైతం అటవీ శాఖ అధికారులు కలవటం లేదు. సమస్యలు ఏకరవు పెట్టటం కాదు, ముందుగా కలవటానికి కారణం చెప్పాలని అంటున్నారు. దానికి అనుగుణంగా ముందుగా చీటీలో పేర్లు రాసి పంపించకుండా కలవటానికి అనుమతించకూడదనే అనధికార నిబంధనలు అమలు చేయటం విమర్శలకు తావిస్తోంది.
ఆ పెద్దపులి మళ్లీ వచ్చేసింది! - బయటకు వెళ్లాలంటే భయపడుతున్న గ్రామస్థులు