Forest Around Hyderabad Outer Ring Road : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో నిత్యం రణగొణ ధ్వనులే. వాయు కాలుష్యం సరేసరి. వీటికి దూరంగా ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరుతూ స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు అవుటర్ చుట్టూ అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ (Hyderabad Metropolitan Development Authority) ఆధ్వర్యంలో పలు పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని అతి త్వరలో ప్రారంభం చేయనున్నారు. ఓఆర్‌ఆర్ (Hyderabad Outer Ring Road) లోపల, బయట ఫారెస్టు బ్లాకులను అభివృద్ధి చేస్తున్నారు. వాటి చెంతనే పలు సౌకర్యాలతో పార్కులను అధికారులు తీర్చిదిద్దుతున్నారు. వారాంతాలు, సెలవుల్లో కుటుంబాలతో వచ్చి ప్రకృతిలో కాసేపు గడిపేలా అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది.
శ్రీనగర్ పార్కు : తుక్కుగూడ ఎగ్జిట్ నంబరు 14 వద్ద 526 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ అటవీ శ్రీనగర్ పార్కు విస్తరించి ఉంది. పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. అవుటర్ నుంచి 12 కిలోమీటర్ల తరువాత ఇది ప్రారంభం అవుతుంది. సదుపాయాల కోసం హెచ్‌ఎండీఏ రూ.8 కోట్లు ఖర్చు చేసింది. అరుదైన జాతుల వృక్షాలు ఇక్కడ మనం చూడొచ్చు.
విదేశీ పర్యటకులను ఆకర్షించేలా ఏపీ టూరిజం పాలసీ
కొత్వాల్‌గూడ వద్ద ఎకో పార్కు : ఓఆర్‌ఆర్ చెంతనే కొత్వాల్‌గూడ వద్ద ఎకో పార్కు (Eco Park at Kothwalguda) పనులు పూర్తి కావొచ్చాయి. వాక్‌వే, పచ్చిక బయళ్లు, మొక్కల పెంపకం, పక్షుల పార్కు సిద్ధమైంది. ఈ నెల చివరిలోపు ఈ పార్కును అధికారులు అందుబాటులోకి తేనున్నారు. రెండో దశలో వివిధ రకాల జాతులతో కూడిన చేపల అక్వేరియంతో పాటు రాత్రి సమయంలో కుటుంబాలతో అడవిలోనే గడిపేందుకు ప్రత్యేక కాటేజీలు నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నారు.
మన్యంకంచ పార్కు : కందుకూర్ మండలం లేమూర్‌లో మన్యంకంచ పార్కు (Manyankanch Park) 58.78 హెక్టార్లలో అధికారులు రూపుదిద్దారు. పలు మౌలిక వసతుల కోసం 4.49 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అవుటర్‌లోని తుక్కుగూడ వద్ద ఎగ్జిట్ 14 నుంచి దిగి ఈ పార్కుకు రావచ్చు.
అర్బన్ ఫారెస్టు పార్కు : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం వద్ద 556.69 హెక్టార్లలో అర్బన్ ఫారెస్టు పార్కు (Urban Forest Park)ను అధికారులు తీర్చిదిద్దారు. ఓఆర్‌ఆర్‌లో పెద్ద గోల్కొండ(ఎగ్జిట్ నంబరు-15) వద్ద కిందకు దిగితే ఈ పార్కుకు చేరుకోవచ్చు. వాచ్ టవర్,సఫారీ ట్రాక్, కూర్చొనేందుకు కుర్చీలు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఎటుచూసినా పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిలారావాలతో ఇది కనువిందు చేస్తోంది.
ప్రయాణం కష్టమే కానీ కళ్లు చెదిరే అందాలు - ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం
పచ్చదనం పరవళ్లు : మహేశ్వరంలోనే హర్షగూడ గ్రామానికి సమీపంలో 87 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేశారు. అవుటర్ రింగ్ రోడ్డులోని తుక్కుగూడ వద్ద(ఎగ్జిట్ నంబరు-14) నుంచి ఈ పార్కుకు రావచ్చు. ఆహ్లాదకరంగా దీన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే పూర్తి పచ్చదనంతో ఈ పార్కు అందాలు ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
లేక్‌వ్యూ పార్కు : గత సంవత్సరం గండిపేట చెరువు పక్కనే 38 కోట్ల రూపాయలతో హెచ్‌ఎండీఏ (HMDDA) లేక్‌వ్యూ పార్కును అందుబాటులోకి తెచ్చింది. 18 హెక్టార్లలో లేక్‌వ్యూ పార్కును అధికారులు తీర్చిదిద్దారు. ఆర్ట్ పెవిలియన్లు, వాక్‌వే, ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పేస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ కోర్టు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 10 వేల మంది వరకు ఈ పార్కుకు వస్తున్నారు.
స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే!