For the First Time in State Government has Used Drones : వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మరో అడుగు ముందకు వేసి వరద లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి మెుదటిసారిగా డ్రోన్ల ద్వారా నీరు, ఆహారం, మెడిసిన్‌ను పంపిణీ చేసింది. బోట్లు, హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా ఈ డ్రోన్లను వినియోగించింది. పలు ప్రాంతంలో బాధితులకు డ్రోన్ ద్వారా ఆహార పంపిణీ సత్ఫలితాలనిస్తోంది. దీనిపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం పంపిణీకి డ్రోన్లు వాడుతున్నామన్నారు. డ్రోన్ల ద్వారా సహాయ చర్యలను వేగవంతం చేశామని తెలిపారు. వరద బాధితులకు సాయం చేసేందుకు డ్రోన్లు వాడటం ఇదే తొలిసారని లోకేశ్ వెల్లడించారు.
సహాయ చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొనండి : వరద సహాయ చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తమ పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దీంతో రేపు (మంగళవారం) ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు సమీప జిల్లాల నుంచి పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, ప్రకాశం బ్యారేజీ భద్రతపై ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
రంగంలోకి డ్రోన్లు - పర్యవేక్షించిన సీఎం : ముందుగా డ్రోన్ల వినియోగానికి ముందు సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. ఈ ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, మెడిసిన్, తాగునీరు వంటివి తీసుకెళ్లొచ్చని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వీటిని ఏ మేరకు వినియోగించుకోవచ్చో చూసుకొని వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ట్రయల్ రన్‌కు మూడు ఫుడ్‌డెలివరీ డ్రోన్లను వినియోగించగా, మరో ఐదు డ్రోన్లు సిద్ధంగా ఉంచారు.
ఎప్పటికప్పుడు అధికారులకు సీఎం సూచనలు : వరద సహాయ చర్యల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటివరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్లు, పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సీఎం సూచనలు ఇస్తున్నారు.
మొద్దు నిద్ర వీడకుంటే ఎలా? - అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - Chandrababu Reviews on Floods