Food Safety Violations in Hyderabad Hotels : ప్రస్తుత కాలంలో ఎవరకీ క్షణం తీరిక ఉండటం లేదు. కనీసం వండుకుని తినడానికి కూడాచాలామందికి తీరిక ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై ఆధారపడుతున్నారు. మరోవైపు కొందరు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తున్నారు. ఒకప్పుడు హోటల్లో తినడమంటే ఎగిరి గంతేస్తూ వెళ్లే వారు ఇప్పుడు బయటి ఫుడ్ అంటేనే భయపడుతున్నారు. కారణం గత కొన్ని రోజులుగా తెలంగాణలో వరుసగా హోటళ్లు, రెస్టారెంట్లపై జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.
హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. వరుసగా తనిఖీలు చేస్తూ ప్రమాణాలు పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు హోటళ్ల తీరును చూసి అధికారులు షాక్కు గురవుతున్నారు. కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహారపదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయటి ఫుట్ తినాలంటే భయపడుతున్నారు. ఒకపూట కడుపు మాడ్చుకున్నా ఫర్వాలేదు ఇంటికెళ్లి వండుకుని తినాలి అని ప్రజలు నిర్ణయానికి వచ్చేలా రెస్టారెంట్ల తీరు ఉంది.
తాజాగా హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హోటల్ అశోకా, కిచెన్ ఆఫ్ మూన్‌లైట్ బార్, హైడ్రేట్ ది బార్, న్యూ ఫిష్‌ల్యాండ్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీటిల్లో గడువు తీరిన ఆహార పదార్థాలు, పాడైపోయిన చికెన్ (5 కేజీలు), కారమెల్ కలర్, పెసర్లు (10 కేజీలు)ను గుర్తించి వాటిని అధికారులు సీజ్ చేశారు. మాంసం నిల్వ ఉంచే ప్రాంతంలో బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు.
శుభ్రత లేని కిచెన్ - పురుగులు పట్టిన ఐస్క్రీమ్
Food Safety Violations In Hyderabad Hotels : ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు పాటించని లేబుల్ లేని కాజు (24 ప్యాకెట్లు), వండటానికి సిద్ధం చేసి ఫ్రిజ్‌లో ఎప్పటి నుంచో నిల్వ ఉంచిన పదార్థాలను సీజ్ చేసి నోటీసులు ఇచ్చారు. లక్డీకాపూల్‌లోని హైడ్రేట్ ది బార్‌లో ఎక్స్‌పైరీ అయిన చికెన్ వింగ్స్ (10 కేజీలు), అముల్ పీనట్, పాస్తా (5 కేజీలు), లేబుల్ లేని బీబీక్యూ సాస్ గుర్తించి సీజ్ చేశారు. హోటల్ న్యూ ఫిష్‌ల్యాండ్‌లోని కిచెన్‌లో ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్, మూతలు ఏర్పాటు చేయని డస్ట్ బిన్లు, లేబుల్ లేని పదార్థాలు సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు.
ఐస్క్రీమ్లో ఫంగస్ - చుట్టూ అపరిశుభ్ర వాతావరణం - భద్రాచలంలో ఆ హోటల్ సీజ్