Food Delivery Boy Got 3 Govt Jobs : కుటుంబ ప్రోత్సాహం ఉండి, ఆర్థిక పరిస్థితులు బాగున్న వారే ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టంగా మారింది. కానీ పేద కుటుంబంలో పుట్టిన ఈ యువకుడి జీవితమంతా కష్టాలమయమే. చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఆసక్తి. కానీ ఆర్థిక ఇబ్బందులు వెనక్కి నెడుతూ వచ్చాయి. అయినా మెుక్కవోని దీక్షతో ముందుకు కదిలాడు. ఎట్టకేలకు 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు వాడికారి బల్వంత్ రావు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన బాపురావు, బాలంబాయిల కుమారుడు బల్వంత్‌రావు. పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతడు, కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువు అయిన తరువాత తల్లిదండ్రులకు భారంగా మారకూడదని, 2015లో హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగం కోసం సాధన మొదలుపెట్టాడు.
బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్‌కు వచ్చిన బల్వంత్‌రావు, ఆర్థిక సమస్యల కారణంగా పుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూనే చదువు కొనసాగించాడు. పలు సందర్భాలలో హేళనకు గురైనా, వాటిని పట్టించుకోకుండా తన లక్ష్య సాధన దిశగా అడుగులేశాడు. చదువు ఒక్కటే తన జీవితాన్ని మారుస్తుందని బలంగా నమ్మి, రేయింబవళ్లు కష్టపడ్డాడు. ఆ కష్ట ఫలితమే ఇటీవల విడుదలైన గురుకుల ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్ ఉద్యోగాలు సాధించేలా చేసింది. టీజీటీలో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్, పీజీటీలో 10వ ర్యాంక్, జేఎల్‌లో 21వ ర్యాంక్ సాధించాడు బల్వంత్ రావు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం సాధన చేసే క్రమంలో తినడానికి తిండి లేక, హరేరామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5 భోజనం చేస్తూ తన కడుపు నింపుకునేవాడు. ఆర్థిక కారణాల దృష్ట్యా తన చదువు కోసం ప్రైవేట్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. కానీ చదువుకోవడానికి సమయం సరిపోకపోవడంతో జొమాటో, స్విగ్గీలో చేరి ప్రిపరేషన్‌కు సమయం ఉండేలా చూసుకున్నాడు.
మన కోసం అవకాశాలు ఎప్పుడూ ఉండవు. మనమే అవకాశాలను సృష్టించుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లకు కుంగిపోకుండా జీవితంలో ముందుకు సాగాలి. కష్టపడితే విజయం కచ్చితంగా వరిస్తుంది. యువతకు చాలా మంచి మార్గాలు ఉన్నాయి. వాటిలో పయనిస్తూ, మనకు కావాల్సిన దారిని ఎంచుకోవడమే మన ముందు ఉన్న కర్తవ్యం. - బల్వంత్‌రావు
గతంలో 2 మార్కులతో ఎస్జీటీ ఉద్యోగ అర్హత కోల్పోయాడు బల్వంత్ రావు. దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. కోరుకున్న ఉద్యోగం తృటిలో తప్పడంతో తీవ్రంగా నిరాశ చెందాడు. ఆ సమయంలో శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్‌కు చెందిన సిద్దార్థ, అలాగే స్కూల్ అసిస్టెంట్ సుధాకర్ వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించారు. ఏ చిన్న కష్టం వచ్చినా, తాము ఉన్నాం అని అండగా నిలిచారు. బల్వంత్‌రావు అందరి కంటే భిన్నంగా ఆలోచించే వాడని, ఆర్థిక కష్టాలు ఉన్నా చదువును ఏనాడూ పక్కన పెట్టలేదని చెబుతున్నారు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు. ఇలాంటి విద్యార్థి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు.
పేదరికం నేర్పిన పాఠం - వ్యవసాయం కూలీ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రపీఠం
ఉన్నత లక్ష్యాలు చేరాలంటే తాత్కాలిక ఆనందాలు వదిలి వేయాలని గుర్తించాడు బల్వంత్‌రావు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కష్టపడితే ఫలితం కచ్చితంగా ఉంటుందని నమ్మాడు. అందుకే కష్టపడి కాకుండా ఇష్టపడి చదివాడు. 3 ప్రభుత్వ కొలువులు సాధించాడు.
అయినవాళ్లు లేకున్నా అనుకున్నది సాధించాడు - 10 ఏళ్లు కష్టపడి 4 సర్కార్ కొలువులు కొట్టేశాడు
ఓయూ దిద్దిన వాచ్‌మెన్ కథ ఇది - కోచింగ్ లేకుండానే ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం