Projects Gates Opened in Telangana : కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు ఈ ఏడాది పూర్తి జలకళ వచ్చింది. బేసిన్‌లో ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయి. కర్ణాటక మొదలు బంగాళాఖాతంలో కలిసే వరకు అంతటా అదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత నెలలో కురిసిన వర్షాలకే ప్రాజెక్టులన్నీ నిండాయి. తాజా వర్షాలతో వరద మరింతగా పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలశయాలు నిండటంతో జూరాలకు మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దాదాపుగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.
తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి దగ్గర పడుతుండటంతో అక్కడి నుంచి ఔట్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికే 211 టీఎంసీలకు పైగా నీరు చేరింది. జలాశయానికి వస్తున్న 5 లక్షలకు పైగా క్యూసెక్కులను పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున్ సాగర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాగర్ పూర్తి నిల్వ 312 టీఎంసీలు కాగా ఇప్పటికే 304 టీఎంసీలకు పైగా నీరు చేరగా, అక్కడకు వచ్చి చేరుతున్న దాదాపు ఐదున్నర లక్షల క్యూసెక్కుల నీటిని పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల సామర్థ్యం 45 టీఎంసీలు కాగా, ఇప్పటి వరకు 41 టీఎంసీలకు పైగా నీరు ఉంది. అక్కడికి వస్తున్న దాదాపు ఐదున్నర లక్షల టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఉరకలు వేస్తున్న కృష్ణమ్మ : నదిలో వస్తున్న వరదతో పాటు ఎగువన ఉన్న బుడమేరు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తుంటే అంతే మొత్తం పూర్తిగా దిగువకు వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తోంది. వర్షాలు కాస్తా తగ్గుముఖం పట్టడంతో కృష్ణా జలాశయాల్లోకి వచ్చే వరద ఒకటి, రెండు రోజుల్లో స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఐతే ఎగువన అప్పర్ బీమా, అప్పర్ కృష్ణా, లోయర్ కృష్ణా సబ్ బేసిన్లలో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉండటంతో ఇన్‌ఫ్లోలు అదేరీతిలో కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నిండుకుండల్లా మారిన జలాశయాలు - భారీ వర్షాలతో సంతరించుకున్న జలకళ - Huge Floods in Dams
కృష్ణా నదిలో గంటగంటకూ పెరుగుతున్న వరద - బిక్కుబిక్కుమంటున్న 'దివిసీమ' - flood flow of Krishna river