Flood Effect In Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి జోరు వానలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వైరా జలాశయానికి భారీగా వరద చేరి పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతోంది. జలాశయం అలుగుల ద్వారా దిగువకు భారీగా వరద ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కొనిజర్ల మండలం పల్లిపాడు నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారిలో పగిడేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో భట్టి పర్యటన : వైరాలోని సత్రం బజార్, ఇందిరమ్మ కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఏనుకూరు, తల్లాడ మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా చిలుకూరు కూడలి సమీపంలోని వైరానది, మున్నేరు, కట్టలేరు పొంగిపొర్లుతున్నాయి. మధిర నియోజకవర్గం చింతకాని, ముదిగొండ మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు.
గండ్లు పడ్డ రోడ్లు, నీటమునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. చింతకాని మండలం మతికేపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గట్టుబంధం చెరువు ప్రవాహం వల్ల తిరుమలాపురం రహదారి మీద భారీగా గండ్లు ఏర్పడ్డాయి. వరద ఉద్ధృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను భట్టి ఆదేశించారు.
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి : ఎడతెరిపి లేని వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 2,3 ఉపరితల గనుల్లోకి భారీగా వరదనీరు చేరడంతో రోజుకు 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని దుబ్బపల్లిలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. పంట చేనులో కలుపు తీస్తుండగా పిడుగు పడడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇల్లు కూలి మహిళ మృతి : మెదక్ జిల్లా టేక్మాల్‌లో వానలకు తడిచిన పెంకుటిళ్లు కూలి ఓ మహిళ మృతి చెందింది. ఘటనపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహా మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల నగదు అందించారు. అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా 11వేల రూపాయలు అందించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.