Flood Effect in Andhra Pradesh: ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. రాజమహేంద్రవరం వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గంటగంటకు గోదావరిలో వరద పెరుగుతోంది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట వద్ద రాత్రి 9 గంటల సమయానికి10 అడుగుల పైకి నీటిమట్టం చేరింది. శనివారం అర్థరాత్రి కాటన్ బ్యారేజీ మొదటి గేటు వద్దకు ఇసుకు బోటు కొట్టువచ్చి ఇరుక్కుపోయింది. బోటును తొలగించేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
నల్లజర్ల, నిడదవోలు, ఉండ్రాజవరం, కొవ్వూరు మండలాల్లో ఎర్ర కాల్వకు వరద పోటెత్తింది. నిడదవోలు మండలం తాళ్లపాలెం, సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, నల్లజర్ల మండలం అనంతపల్లి పరిధిలో గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. తాళ్లపాలెం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు మరబోట్లు ఏర్పాటు చేశారు. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం-దువ్వ మధ్య రహదారి మునిగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్దరి, పసలపాలెం గ్రామాల్ని ఎర్రకాల్వ వరద చుట్టుముట్టింది. కొవ్వూరు మండలం నందమూరులో ఎర్ర కాల్వ పొలాల్ని ముంచేసింది.
నీట మునిగిన వేల ఎకరాల వరి: తాళ్లపూడి, గోపాలపురం, కొవ్వూరు, చాగల్లు మండలాల్లో కొవ్వాడ కాల్వకు మరింత వరద పోటెత్తింది. చిట్యాల-తిరుగుడుమెట్ట రహదారి నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేల ఎకరాల్లో వరి నాట్లు నీటిలో నానుతున్నాయి. చాగల్లు-కొవ్వూరు రహదారిపైనా నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొవ్వాడ, పేముల కాల్వ వరద తీవ్రతతో వేల ఎకరాల్లో వరి నీట మునిగింది. తాళ్లపూడి మండలం అన్న దేవరపేటలోని జాన్ పేట దళితవాడ ముంపులోనే మగ్గుతోంది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
విద్యా సంస్థలకు సెలవు: కోనసీమ జిల్లాలోనూ వరద ముంపులోనే వరి పొలాలు నానిపోతున్నాయి. నాట్లు, నారుమళ్లు కుళ్లిపోతాయని రైతులు దిగాలు పడుతున్నారు. మండపేట, కపిళేశ్వరపురం, ఆలమూరు, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ముమ్మిడివరం, అల్లవరం, మామిడికుదురు, రాజోలు, మల్కిపురం మండలాల్లో వేల ఎకరాల్లో వరి నీట మునిగింది. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కనకాయలంక కాజ్‌వేపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
వంతెనపై వరదలో చిక్కుకున్న బైక్ - రక్షించిన స్థానికులు - Youth Tried Cross Bridge on Bike
మరపడవలపై రాకపోకలు: కోనసీమ జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నదీ పాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల ప్రజలు మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని ముంపునకు గురైన పంట పొలాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. పాలకొండలో పర్యటించిన ఆయన వ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం వరద ప్రభావిత ప్రాంతాలైన చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం, ఎటిపాక మండలాల్లో ఎమ్మెల్యే మిర్యాల శిరీషా దేవి పర్యటించారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న ఆమె, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సీలేరు జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికు చేరుకుంది. ఆదివారం ఒక్క రోజులోనే 5 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. ఏక్షణంలోనేనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు జెన్‌కో వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలో ఎడతెరపిలేని వర్షాలు - ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు - SCHOOL HOLIDAYS DUE TO RAINS