Young Girl Adya Performing Amazingly in Kuchipudi Dance : పట్టుమని ఐదేళ్లు నిండని ఆ చిన్నారి నాట్యంలో రికార్డులు మోత మోగిస్తోంది. "పిట్ట కొంచెం కూత ఘనం" అన్నట్లుగా ఇప్పటికే 22 వేదికలపై కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చి ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తనదైన నాట్యపటిమతో వండర్ రికార్డులో చోటు దక్కించుకున్న చిట్టిచిన్నారిగా ఘనత దక్కించుకుంది. బాల నాట్యమయూరిగా పేరు తెచ్చుకుంటున్న చిన్నారి ఆద్యలక్ష్మిపై కథనం.
సినిమా హీరోయిన్ నృత్యాన్ని చూసి : మామూలుగా ఐదేళ్ల వయసున్న చిన్నారులు అమ్మచేతి గోరుముద్దలు తింటూ, వచ్చీ రాని మాటలతో ఇంట్లో సందడి చేస్తుంటారు. అయితే అనంతపురానికి చెందిన అరుణ్ కుమార్, అర్చితల కుమార్తే ఆద్యలక్ష్మి మాత్రం అందరిలాంటి పిల్ల కాదు. చిన్నప్పుడే నాట్యప్రవేశం చేసింది. సినిమా హీరోయిన్ నృత్యాన్ని టీవీలో చూసి రెండున్నరేళ్ల వయసులోనే అనుకరించింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న వయసులోనే మంచి నృత్య ప్రతిభను కనబరిచిన ఆద్యకు ఎలాగైనా సంప్రదాయ నృత్యాన్ని నేర్పించాలని తలిదండ్రులు భావించారు.
స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్న భవానీ కార్తీక్ - స్వర్ణ పతకాలతో సవాల్
ప్రముఖుల ఎదుట ప్రదర్శన : యూట్యూబ్ వీడియోలు చూసి ముందుగా నాట్యంపై అవగాహన పెంచుకున్నారు. చిన్నారికి డాన్స్ నేర్పించడానికి బెంగుళూరు, అనంతపురంలో పలువురు నృత్య గురువులను సంప్రదించారు. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తూ తమ కుమార్తెను శిక్షణకు తీసుకెళ్లడం ఇబ్బందని తెలుసుకొని, ఆద్యను అనంతపురంలోని అవ్వ, తాతల వద్ద ఉంచాలని నిర్ణయించారు. ఇలా రెండున్నరేళ్లపాటు వారానికోసారి బెంగుళూరు నుంచి పాపను చూడటానికి వచ్చివెళుతూ ఆద్య అనంతపురంలోనే శిక్షణ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతపురం శృంగేరి మఠంలో తొలుత అరంగేట్రంతో మొదలైన ఆద్య నృత్య ప్రస్థానం అనతి కాలంలోనే ఎంతోమంది ప్రముఖుల ఎదుట ప్రదర్శన చేసే వరకు ఎదిగింది.
వండర్ బుక్ లో వండర్ కిడ్ : ఐదేళ్ల వయసు వచ్చేసరికి తోటి పిల్లల్లా అక్షరాలు నేర్చుకోవడమే కాకుండా ఏకంగా రాష్ట్ర గవర్నర్ ను మెప్పించేలా ఆద్యలక్ష్మి నృత్య ప్రదర్శన ఇచ్చింది. రాజ్ భవన్ లో గవర్నర్ ఎదుట ఈఏడాది మార్చిలో ఆద్య నృత్యం చేసి మెప్పించింది. హంపీ ఉత్సవాల్లో, తిరుమల, కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో వేదికలపై చేసిన నృత్యం ఉత్సవాలకు వచ్చిన వేలాది మంది భక్తులను అకట్టుకుంది. శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, ఒంటిమిట్ట ఆలయాల వద్ద ప్రత్యేక వేదికలపై ఆద్య నృత్యం వీక్షకులను హత్తుకునేలా చేసింది. అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన ఆద్యకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు యూనిక్ కిడ్ గా గుర్తింపు ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రదర్శన అనంతరం వండర్ బుక్ లో వండర్ కిడ్‌గా చిన్నారి ఆద్య లక్ష్మి చోటుదక్కించుకుంది.
విలాసవంతమైన జీవితం వదులుకుని 'వే' చూపిస్తున్న యువకుడు
"ఎన్ని వేల మంది ఆసీనులైన వేదిక అయినా ఏమాత్రం భయం లేకుండా చిరునవ్వుతో ప్రదర్శన ఇచ్చే నైపుణ్యం ఆద్య సొంతం. మిగతా పిల్లలతో పొలిస్తే ఆద్య త్వరగా నేర్చుకుంటుంది. చాల కష్టపడుతుంది. అదే ఇన్ని బహుమతులను తెచ్చిపెట్టిందని నమ్ముతున్నా. ఇంత చిన్న వయస్సులోనే వండర్ బుక్‌లో వండర్ కిడ్‌గా నిలవటం చాల అరుదు." - రమ్యకృష్ణ, ఆద్య నృత్య గురువు
నృత్య గురువులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే కేవలం మూడేళ్లలోనే గవర్నర్ ను మెప్పించేలా ఆది లక్ష్మి నృత్యం చేసిందంటూ చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కూచిపూడి నృత్యంలో ఆద్య లక్ష్మి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
'ఈ స్థాయిలో ఉండడానికి హార్డ్‌వర్క్, తల్లిదండ్రులే కారణం - ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం'