Five YCP Corporators joined Janasena Party : ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. 59వ వార్డు కార్పొరేటర్ పూర్ణశ్రీ, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిసెట్టి ఉషశ్రీ, 47వ వార్డు కార్పొరేటర్ కామేశ్వరి, 77వ వార్డు సూర్యకుమారి, 49వ వార్డు కార్పొరేటర్ లీలావతి భర్త శ్రీనివాస్‌లు పార్టీలోకి చేరారు. అలాగే మాజీ కార్పొరేటర్ సుశీల, శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ మాజీ ఛైర్మన్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, వైఎస్సార్సీపీ నేత పాపిరెడ్డి మహేశ్వరరావు, లోక్ సత్తా నాయకులు సత్యనారాయణలను పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో కూటమి అభ్యర్థి? - Alliance Candidate in MLC Elections
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తర్వాత కాలుష్య నివారణపై చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ సభ్యత్వాలు 12 లక్షలు దాటిన నేపథ్యంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌ను ఘనంగా సత్కరించారు.
ఆగస్టు 30న పోలింగ్ : ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. ఈరోజు నోటిఫికేషన్ విడదల కాగా.. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మరుసటి రోజు 14న స్క్రూటినీ, ఆగస్టు 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఉప ఎన్నిక పోలింగ్ ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. అదేవిధంగా సెప్టెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
పోటీపై కసరత్తు : ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు ఓటు హక్కు కలిగి ఉంటారు. విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఇక్కడనుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ తాజాగా జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు పోటీపై కసరత్తు మొదలుపెట్టాయి.
రాజకీయంగా ఉరట కోసం : ఇప్పటికే సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలలో దారుణ ఓటమి చూసిన వైఎస్సార్సీపీ కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి కైవసం చేసుకుని రాజకీయంగా ఉరట పొందాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి రాష్ట్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని వైసీపీ పార్టీ ఖరారు చేసింది. కూటమి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది.
మంత్రి లోకేశ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం- టీడీపీలో చేరిక లాంఛనమే!