Five children become orphans : అసలే పేద కుటుంబం. కూలీ నాలీ చేసుకుంటే తప్ప డొక్కాడని దుస్థితి. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి. అయితే విధికి కన్ను కుట్టిందో ఏమో కానీ ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఏడాదిన్నర కింద తండ్రి, ఇటీవల తల్లి చనిపోవడంతో ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు. సహృదయులు స్పందించి ఆదుకుంటే పిల్లల భవిష్యత్ బాగుపడుతుందని బంధువులు, గ్రామస్థులు కోరుతున్నారు.
భర్త చనిపోవడంతో అన్నీ తానై : వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన హుస్సేనయ్య, సునీత దంపతులకు ఏడాదిన్నర వయసు నుంచి పదిహేనేళ్లలోపు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఏడాదిన్నర కిందట భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబానికి అండగా నిలిచిన ఇంటి పెద్ద దూరం కావడంతో ఆ భారం అంతా భార్యపై పడింది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్నినెట్టుకొచ్చింది. తల్లి కూలీ చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో పెద్ద కుమారుడు భానుప్రకాశ్ ఎనిమిదో తరగతిలోనే చదువు మానేసి తల్లికి తోడుగా కూలీ పనులకు వెళ్తూ ఆసరాగా నిలిచాడు.
అనారోగ్యంతో మృతి చెందిన తల్లి : ఇంటిపెద్ద దూరమవటంతో కూలీ పనులు చేసుకుంటూ ఐదుగురి పిల్లల ఆలనా పాలనా చూస్తున్న తల్లి సైతం అనారోగ్యానికి గురై ఇటీవల కన్నుమూసింది. దీంతో ఐదుగురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరూ దూరం కావడం, సొంత ఇల్లు లేకపోవటం అంతా చిన్న పిల్లలు కావడంతో ఆ పిల్లల భవిష్యత్, పోషణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. తల్లిదండ్రుల మృతితో తమ్ముళ్లు, చెళ్లెళ్ల భారమంతా పెద్ద కుమారుడు భానుప్రకాశ్‌పై పడింది.
అనాథలుగా మారిన పిల్లలు : ప్రస్తుతం చిన్నాన్న బాలరాజు సంరక్షణలో ఉన్నప్పటికీ, పోషణ భారంగా మారింది. తల్లి దూరమవడంతో ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఏడుపు చూపరుల్ని కంటతడి పెట్టిస్తోంది. చెల్లెలు, తమ్ముళ్లను సముదాయించడం పెద్ద కుమారుడు భానుప్రకాష్‌కు కష్టంగా మారింది. పూట గడవటం కష్టంగా మారడంతో ఆపన్న హస్తం కోసం ఆ పిల్లలు ఎదురు చూస్తున్నారు. సహృదయులు ఆదుకుంటే తప్ప భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తోంది. దాతలు కనికరించి చదువు, పోషణ కోసం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం సైతం స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.
Orphan Kids story in Yadadri : అనాథలైన ముగ్గురు చిన్నారులు.. ఆదుకోవాలని నానమ్మ వేడుకోలు
Three Orphaned Children: అమ్మానాన్న లేరు.. ఆపదలో ఉన్నాం.. ఎవరైనా మమ్మల్ని ఆదుకోండయ్యా