First Case in Telangana Under New Laws : భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్‌ఏ) అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 281 భారతీయ న్యాయ సంహిత, ఎంవీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్‌ను డిజిటల్‌గా నమోదు చేశారు.
దేశంలోనే ఫస్ట్ కేసు అక్కడే : అయితే భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు దిల్లీలో నమోదైంది. న్యూ దిల్లీ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దేశ రాజధానిలో ఒక వీధి వ్యాపారి రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. అతడి తాత్కాలిక దుకాణం ఎన్‌డీఆర్‌ఎస్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఉంది. దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
దాంతో దానిని వేరేచోటుకు తరలించమని అతడికి పోలీసులు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దానివల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ వీధి వ్యాపారిని బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
అసలేంటీ చట్టాలు : దేశంలో బ్రిటీష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్‌ఏ) ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీరో ఎఫ్‌ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నాయి.