Fire Accident in Jakotia Mall in Warangal : గత రాత్రి వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్‌లోని జకోటియం మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో ఐదు వాణిజ్య సముదాయాలు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 2 గంటల సమయంలో మంటలు ఆర్పివేసినట్లు అధికారులు చెప్పినా మరోసారి తెల్లవారుజామున ఎగిసిపడ్డాయని వెల్లడించారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఆ ప్రమాదంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంతో పాటు కంది చిట్‌ఫండ్ కార్యాలయం, వద్దిరాజు కన్వెన్షన్ హాల్ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు.
కాటేదాన్‌లో పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం - fire accident in Katedan
" షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మొదలైన మంటలు మిగతా వాటికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ అధికారులు అందరి సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. " - నందిరాం నాయక్, వరంగల్ ఏసీపీ
Fire accident At Shamshabad Iron Material Godown : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత ఇనుప సామాన్ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లో అవి తీవ్రరూపం దాల్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. పాత ఇనుప సామాన్ల గోదాం పక్కనే గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ, చుట్టుపక్కన ఇళ్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున పొగలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులను అక్కడ నుంచి వేరే ప్రదేశానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Fire Safety Measures : ఈ నేపథ్యంలో అధికారులు స్థానికులకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు లిఫ్ట్‌లో వెళ్లకూడదని, మెట్ల మార్గం ద్వారానే బయటకు వెళ్లాలని సూచించారు. మంటలు ఎక్కువవుతున్న సమయంలో వాటిని ఆర్పడానికి మట్టి, నీరు లాంటివి వాడాలన్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి పరికరాలు ఉంటే ఉపయోగించే ప్రయత్నం చేయాలని తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా ఉన్న వారందరిని బయటకు పంపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అగ్నిమాపక సిబ్బంది సూచనలు చేశారు.