Ramgopal varma case : సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఈ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒంగోలు గ్రామీణ సీఐ కార్యాలయంలో విచారణకు రావాల్సి ఉన్న ఆర్జీవీ గైర్హాజరయ్యారు. ఈ విషయమై ఆయన వాట్సాప్ ద్వారా మద్దిపాడు పోలీసులకు మెసేజ్ చేశారు.
వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ పోస్టు చేశారని అభియోగాలు ఉన్నాయి. ఇదే విషయమై తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు సైతం కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసు విచారణకు హాజరు కావాలంటూ ఎస్సై శివ రామయ్య ఆధ్వర్యంలోని బృందం వారం రోజుల కిందట (నవంబర్ 13న) హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న వర్మ ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న వర్మ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. ఈ నెల 19న విచారణ హాజరు కావాలని మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారని, హాజరయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ సందర్భంగా వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్ట్ విషయంలో ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. విచారణకు హాజరుకావాలనే గడువు పొడిగింపు కోసం పోలీసులు ముందు అభ్యర్థన చేసుకోవాలని, కోర్టు ముందు కాదని న్యాయస్థానం స్పష్టం తెలిపింది.
తాజా పరిణామాల నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజులు సమయం కావాలంటూ వర్మ మద్దిపాడు పోలీసులకు వాట్సాప్‌లో సమాచారం పంపినట్లు తెలిసింది.
ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు - అరెస్టుపై ఆందోళన
చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై ఆర్జీవీ పోస్టు - పలు స్టేషన్లలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదు