Father Murder his Son in Alluri Sitarama Raju District : మద్యం మత్తులో నిత్యం వేధిస్తున్న కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జీకేవీధి మండలం ఏనుగుబైలులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గూడెంకొత్తవీధి సీఐ వర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కొర్రా సన్యాసిరావు(40) భార్య దలిమొతి, తండ్రి చిత్రో, తల్లి లచ్చితో కలిసి నివాసం ఉంటున్నాడు. సన్యాసిరావు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను, తల్లిదండ్రులను కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న పొలంలో పని చేస్తున్న మామ చిత్రోకు దలిమొతి భోజనం తీసుకెళ్లింది. సన్యాసిరావు పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తన తండ్రికి భోజనం తీసుకెళ్లినందుకు భార్యను కొట్టాడు.
కుమారుడి తలపై మోదిన తండ్రి : భర్త కొట్టడం వల్ల తర్వాత ఏమైనా చేస్తాడమోనన్న భయంతో దలిమొతి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం సన్యాసిరావు పొలం పనులు చేస్తున్న తండ్రి వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. చంపేస్తానని వెంటపడ్డాడు. కుమారుడు అక్కడకు రావడంతో తనను చంపేస్తాడని భయపడి తన వద్ద ఉన్న గొడ్డలి పిడితో సన్యాసిరావు తలపై గట్టిగా కొట్టాడు. దీంతో సన్యాసిరావు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని తండ్రి పూడ్చి పెట్టాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా పారిపోయాడు. ఈ నెల 21న దలిమొతి పుట్టింటి నుంచి వచ్చి భర్త కోసం ఆరా తీయగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఏలూరు జిల్లాలో దారుణం - ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడి దారుణ హత్య
నిందితుడు కోసం గాలింపు చర్యలు : మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం డీఎస్పీ అహ్మద్, జీకేవీధి సీఐ వర ప్రసాద్, ఎస్సైలు రవీంద్ర, అప్పలసూరి, ఉప తహసీల్దారు సీతారాం, అధికారులు పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించారు. చింతపల్లి వైద్యాధికారిణి భారతి పోస్టుమార్టం నిర్వహించారు. . అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేశామని, నిందితుడు చిత్రో కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.