Father Suicide After Killing Three Children Rangareddy : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపిన అనంతరం ఓ తండ్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మోకిలా పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి(Govt Hospital) తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అప్పుల బాధతో నిరటి రవి(35) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పిల్లలను చంపి అనంతరం చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాడు. స్వగ్రామంతో పాటు ఇతర గ్రామాల్లో తనకు తెలిసిన సన్నిహితులు, బంధువుల వద్ద నుంచి మనీ స్కీమ్ ద్వారా వెయ్యికి మూడు వేల రూపాయలు, రూ.లక్షకు రెండు నెలలకు గానూ రూ.5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్నాడు.
తన డబ్బు కూడా ఈ స్కీమ్‌లోనే పెట్టి స్కీమ్ నిర్వాహకుడికి ఇచ్చాడు. ఇప్పటికి ఏడాది కాలం గడుస్తున్నా, ఫౌండేషన్ నుంచి డబ్బులు రాకపోవడంతో తిరిగి ప్రజలకు చెల్లించలేకపోయాడు. స్ధానిక ప్రజల(Native People) నుంచి ఒత్తిడి రావడంతో తట్టుకోలేక టంగుటూరు గ్రామం నుంచి శంకర్‌పల్లికి రవి కుటుంబ సభ్యులతో వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున దంపతుల మధ్య నగదు చెల్లింపు విషయంపై గొడవలు జరిగాయి.
Father Killed Three Children and Committed Suicide : అనంతరం శంకర్‌పల్లి నుంచి ముగ్గురు పిల్లలతో స్వగ్రామానికి చేరుకున్న రవి, ఇవాళ తెల్లవారుజామున తన పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను మోసపోవడమే గాక తన వల్ల ఎంతో మంది మోసపోయేలా చేసానని రవి మనస్తాపం చెందాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థంగాక చివరకు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. అయితే తను చనిపోతే తన పిల్లలు అనాథలై పోతారని భావించాడో లేక వారంతా డబ్బు కోసం తన పిల్లలను ఇబ్బంది పెడతారనుకున్నాడో కానీ వాళ్లను చంపేసి అనంతరం తాను చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
ఇలా మనీ స్కీమ్‌తో(Money Scam) ఎంతో మంది మోసపోతున్నారని పోలీసులు తెలిపారు. వెయ్యికి రెండు వేలు, లక్షకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పే వారి మాటలు నమ్మకూడదని పోలీసులు సూచించారు. వారు మొదట రెండు మూడు సార్లు డబ్బు చెల్లించి నమ్మకం కుదిరాక ఇలా పెద్ద మొత్తంలో నగదుతో పరారవుతారని తెలిపారు. అందుకే ఇలాంటి స్కీమ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.