Farmers Worried Crop Loss in jangaon : జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో నీరు లేక వందల ఎకరాల్లో వరి పంట చేతికి రాకుండా ఎండిపోయింది. ఈ ప్రాంతం మెట్ట ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ బోర్లు వేసినా నీళ్లు రావు. దగ్గర్లో మల్లన్న గండి రిజర్వాయర్ ఉన్నా, చుక్క నీళ్లు రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి కెనాల్ కాలువను తీశారు. ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా కెనాల్ ద్వారా పొలాలకు నీళ్లు రాలేదంటూ రైతులు వాపోతున్నారు.
Crops Dry Up in jangaon : ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడి పరిస్థితి మారడం లేదని, చేసేది ఏమీ లేక ఎండిన పంటల్లో పశువులను మేపుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి కెనాల్ ద్వారా నీళ్లను అందిస్తే మెట్ట ప్రాంతమైన కొండాపూర్, మధ్యల గూడెం, శ్రీపతిపల్లి, లింగంపల్లి, మల్కాపూర్, పీసర గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడి అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని, చెరువులకు నీళ్లు ఇవ్వాలని, అలాగే ఎండిపోయిన పంటకు పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయి. అప్పులు చేసి పొలాలు సాగు చేస్తే నీరు లేక పంట ఎండిపోయింది. ఇక్కడ బోర్లు వేసినా నీళ్లు రావు. చేసేది ఏమీ లేక పంట పొలాల్లో గొర్రెలను మేపుతున్నాం. గత ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి కెనాల్ కాలువను తీశారు. ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా కెనాల్ ద్వారా మా పొలాలకు నీళ్లు రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మా పంటలకు నీరు అందేలా చేయాలి. - రైతులు
Water Crisis in Telangana : రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లో పతనమయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టాలు, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్లకు పడిపోయింది. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు, నెల రోజుల వ్యవధిలోనే 1 మీటరు వరకు క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులపై రూపొందించిన నివేదికలో ఈ ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూశాయి.
రాష్ట్రంలో ఎండుతున్న పంటలు - అన్నదాతకు తప్పని తిప్పలు - Telangana Farmers Worried Crop Loss