Farmers to Collectorate on Runa Mafi in Khammam : ఆగస్టు 15న ఖమ్మం జిల్లా వైరా నుంచి మూడో విడత రుణమాఫీ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టగా ఇప్పటికే మొదటి, రెండో విడత రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది. మూడో విడత రుణమాఫీ ప్రక్రియలో భాగంగా బ్యాంకుల వారీగా రుణాలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. చివరిదైన మూడో విడతలో రూ. లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రుణాల మాఫీకి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 73 వేల 337 మంది అన్నదాతలకు రూ. 1181 కోట్ల మేర రుణాలు మాఫీ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని అర్హతలున్నా ఇంకా మాఫీ కాని కర్షకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కారణం తెలుసుకునేందుకు రైతులు కలెక్టరేట్ ఫిర్యాదు కేంద్రం వద్ద బారులుతీరుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
'బ్యాంకులో మా అమ్మ పేరుతో 1.54 లక్ష రూపాయలు లోన్ ఉంది. ఆమెకు సుమారు 78 సంవత్సరాలు. అయినా ఆమె లోన్ తీసుకుంది. ఆమెకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు అన్నీ ఉన్నా మీకు రేషన్‌కార్డు లేదు, రుణమాఫీ కాదు అని అధికారులు చెబుతున్నారు. దీంతో జేసీని కలిసి మా సమస్యను వివరించాం'- రైతులు
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారుల వద్ద ఉన్న గణాంకాలకు వాస్తవంగా రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్‌లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రుణాలు మాఫీ కాకపోవడానికి ఆన్‌లైన్‌లో వివిధ సాంకేతిక కారణాలు చూపుతున్నాయి.
రేషన్ కార్డు లేనివారు, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లిన వారి ఖాతాల్లోనూ రుణం జమ కావడం లేదు. అసలు, వడ్డీ లెక్కలు తేలకపోవడం వంటి పరిస్థితులు కర్షకులకు ప్రతిబంధకంగా మారాయి. కలెక్టర్లు చొరవ చూపి సత్వరం తమ సమస్యలను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
'గత నాలుగు సంవత్సరాల క్రితం బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాం. అయితే మాకు రుణమాఫీ కాలేదని ఏవోను కలిశాం. మీకు రేషన్‌కార్డు లేదని అందుకే ప్రస్తుతం రావడం లేదని చెప్పారు. మేమే మీ గ్రామానికి వచ్చి సర్వే చేసేటప్పుడు వివరాలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు'- రైతులు
రుణమాఫీ అమల్లో 31 టెక్నికల్ సమస్యలు - మరి పరిష్కారం ఏంటంటే? - CROP LOAN WAIVER TECHNICAL ISSUES