Farmers Protest to Speed up Govt Grain Purchases : అకాలవర్షాలు, ఈదురుగాలులకు అన్నదాతలు ఆగమవుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలన్న ఆత్రుతతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి కాంటా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు కల్లాలు కొరకు కొంత ప్రదేశాన్ని చూపించాలి. లేకపోతే ఇబ్బందవుతుంది. ఈనెల 24న ద్రోణి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, సర్కార్ సైతం కాస్త ధాన్యం కొనుగోళ్లులో వేగం పెంచాలని కోరుతున్నాం. అదేవిధంగా మిల్లుల దగ్గర కిలో లెక్కన ధాన్యం కటింగ్ చేస్తున్నారు. వీటిపై ఎన్నిసార్లు వాపోయినా ఎవరూ పట్టించుకోవటం లేదు."-స్థానిక రైతులు
కల్లాల్లో ధాన్యం పోసి కాంటా కోసం ఎదురుచూపులు : యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. అకాల వర్షాలతో వారం రోజులుగా కేంద్రాల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంపై టార్పాలిన్లు కప్పుదామన్నా మార్కెటింగ్‌శాఖ తూకం వేసిన బస్తాలకే, ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నా, 20రోజులుగా పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు.
"ఇక్కడ గ్రామ పరిధి పెద్దది కావడంతో వడ్లు ఎక్కువగా వస్తున్నాయి. 30 క్వింటాల్ ధాన్యాన్ని సిస్టమ్ ఒప్పుకోవటంలేదని వాటికి డబ్బులు రావటంలేదని, ఆ సిస్టమ్‌లో చూపించనిది మేమేలా వేయాలంటున్నారు. టార్పాలిన్లు సైతం మేమే కొనుక్కొని రావాల్సి వస్తుంది. ఇక్కడా ఏమీ ఇవ్వటం లేదు. పదిహేను రోజులుగా పడిగాపులు కాస్తుంటే ఇవాళ్టికి గోనెసంచులు ఇచ్చారు, ఇంకా ఈ వడ్లు ఎప్పుడు కొంటారో తెలవదు." -అన్నదాతులు
Yasangi Grain Purchase Delay in Telangana : ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇంకా 50 వేల మెట్రిక్ టన్నులు తేమ, తాలు పేరిట జాప్యంతో కల్లాల్లోనే ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు 259 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 55 కేంద్రాల్లో తూకాలు పూర్తయ్యాయి.
ప్రభుత్వం ఒక లక్షా 97 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇంకా కేంద్రాల్లో 50 వేల మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు, ఇప్పటివరకు 29,262 మంది రైతులకు, 321 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశామని చెబుతున్నారు. మరోవైపు లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసి కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.