Farmers Problems in YSRCP Govt: ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా, దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చిన రైతుల జీవితాలతో వైసీపీ సర్కార్(YSRCP Govt) చెలగాటమాడుతోంది. జగన్(CM Jagan) పాలనలో కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రకృతి వైపరిత్యాలతో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఏడాదికి రెండుమూడు సార్లు పంట మునక తప్పడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. 2023 మిగ్‌జాం తుపాను(Michaung Cyclone) ధాటికి కోతకొచ్చిన పంట నేలవాలి కొన్ని జిల్లాల్లో రైతులు(Farmers) దమ్ము తొక్కించాల్సి వచ్చింది. దీంతో ఎకరాకు 10వేల వరకు పెట్టుబడి పెరిగింది.
తడిసిన ధాన్యం అమ్ముకునేందుకూ రైతుల కష్టాలు(Farmers Problems) అన్నీఇన్నీ కావు. నాణ్యమైన ధాన్యం(Grain) అయినా క్వింటాల్‌కు 100 రూపాయలు కోత పెడుతున్నారు. మొత్తంగా కొనుగోలులో కొర్రీలతో రైతులు ఎకరాకు సగటున 10వేలకు పైనే నష్టపోవాల్సి వస్తోంది. ఫలితంగా గతేడాది అంబేడ్కర్ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల పంట విరామం ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏటా ముంపు బారిన పడుతుండటంతో కొన్నిగ్రామాల్లో ఖరీఫ్ పంట సాగు చేయలేదు. ఇంత జరుగుతున్నా జగన్ సర్కార్ మాత్రం కళ్లు తెరవడం లేదు. అన్నదాతను ఆదుకునే ప్రయత్నమే చేయడంలేదు.
'ఎండిన పైరు రైతు కంట నీరు' - పంటను కాపాడుకోడానికి ఆలుపెరగని పోరాటం
వ్యయప్రయాసాలకొర్చి పండించిన ధాన్యం సేకరణను కూడా ప్రభుత్వం భారంగా భావిస్తోంది. ఏటికేడు కొనుగోలు చేసే ధాన్యం పరిమాణం తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2019-20లో ప్రభుత్వం 83లక్షల టన్నులు సేకరిస్తే 2022-23 నాటికి 49లక్షల టన్నులకే పరిమితం చేసింది. రైతు భరోసా కేంద్రాల(Rythu Bharosa Kendram) ద్వారా సేకరిస్తున్నామని, మిల్లర్ల పాత్ర లేకుండా చేశామని మాటలు చెబుతూనే కోనుగోళ్లకు కోతలు పెడుతున్నారు.
ఈ-క్రాప్(E-Crop), ఈకేవైసీ(EKYC) మొదలు పంట నమోదు, తేమ శాతం, ట్రక్‌షీట్ జారీ వరకూ రకరకాలుగా రైతులను వేధిస్తున్నారు. పోనీ రైతులకు ఏమైనా అధిక ధరలు దక్కి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారా? అంటే అదీ లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం దొడ్డు రకాల ధాన్యమే సేకరిస్తుంది. సన్న రకాలను ఎలాగూ బహిరంగ మార్కెట్లోనే అమ్ముకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ నుంచి నాణ్యమైన 'జయ' రకం బియ్యాన్ని సరఫరా చేస్తే తీసుకుంటామని గతేడాది కేరళ ప్రభుత్వం(Kerala Govt) కోరింది.
దీనిపై రాష్ట్ర ప్రతినిధులు కేరళ పర్యటనలకు వెళ్లారు. సరఫరా చేస్తామని హామీ ఇచ్చి మరీ వచ్చారు. ఆ తర్వాత గాలికొదిలేశారు. రైతులు మాత్రం 'జయ' రకం వేస్తే, వాటిని కొంటారనే ఆశతో భారీగా సాగు చేసి చివరకు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకున్నారు. అవి మిల్లర్లకు చేరాక మళ్లీ ధర పెరిగింది. ఏపీ నుంచి సరఫరా లేక ఈ ఏడాది తెలంగాణ(Telangana) నుంచి సేకరించేందుకు కేరళ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
పంట అమ్మిన సొమ్ము జమ చేయడానికీ సర్కార్ నుంచి సతాయింపులే. సొమ్ము వెంటనే చేతికొస్తే కూలీలకు చెల్లింపులతోపాటు, అప్పు తీర్చుకోవాలని రైతులు పంట అమ్ముతారు. ఐతే వైసీపీ ప్రభుత్వం మాత్రం ధాన్యం అమ్మిన 21 రోజులకు డబ్బు ఇస్తామంటోంది. గతంలో ధాన్యం సేకరించిన 24 గంటల్లో చెల్లింపుల విధానం ఉండేది.
సీఎం సొంత జిల్లాలో కరెంట్ కష్టాలు - ఎండిపోతున్న పంటలు
కొన్ని దఫాలు ఆలస్యమైనా అధికశాతం రైతులకు నిర్ణీత గడువులోగా డబ్బు జమ అయ్యేది. నాలుగున్నరేళ్లలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ రోజు ధాన్యం కొంటే ట్రక్‌షీట్ తయారు చేసేసరికి 10 నుంచి 15 రోజులపైనే అవుతోంది. అంటే అమ్మిన తర్వాత 15 రోజులకు లెక్కలో రాస్తారు. అప్పటినుంచి 21 రోజులు లెక్క వేస్తారు. అధిక సందర్భాల్లో ఆ గడువూ దాటి రెండు, మూడు నెలలు అవుతోంది.
జగన్ జమానాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కడం లేదు. కౌలు కార్డుల్లేవంటూ పంటనష్టానికి పెట్టుబడి రాయితీ రావటం లేదు. బీమా అందట్లేదు. ఇతర రాయితీలూ ఉండవు. కూలీనాలీ చేసి కూడబెట్టిన సొమ్మును ఎకరా, రెండెకరాలు కౌలుకు తీసుకుని పెట్టుబడిగా పెడుతుంటే చిల్లిగవ్వ దక్కక సాగు మానుకుంటున్నారు. 2023-24లో వరి సాధారణ విస్తీర్ణం 57.88లక్షల ఎకరాలు కాగా 44.88 లక్షల ఎకరాల్లోనే అంటే 77.53శాతం విస్తీర్ణంలోనే నాట్లు పడ్డాయి.
ఇందులో ఒక్క రబీ పంట చూస్తే ఫిబ్రవరి మొదటి వారానికి 64శాతం విస్తీర్ణంలోనే నాట్లు వేశారు. సాధారణం కంటే సుమారు 7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కరవు కారణంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వరి ఎండిపోయింది. కృష్ణా డెల్టాలో నీరందక రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి. పంట కోత సమయంలో మిగ్‌జాం వచ్చి ముంచేసింది. అయినా ఇటీవల విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో ఎకరాకు సగటు దిగుబడి ఖరీఫ్‌లో 22 క్వింటాళ్లు, రబీలో 28.50 క్వింటాళ్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.
జగన్ సర్కార్ ఏకీకృత విధానంతో రైతును మరింత దగా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇసుక అమ్మకాల(Sand sales)ను ఒకే సంస్థకు కట్టబెట్టి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మద్యం సరఫరా విధానం(Liquor Supply System) కూడా ఏకీకృతం చేసి సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాల(Alcohol Sales)తోపాటు అంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు. ఇదే కోవలో 2022 రబీలోనే ధాన్యం సేకరణ బాధ్యతల్ని జిల్లాకు ఒక మిల్లరుకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచించింది.
ఇందుకు అనుగుణంగా టెండర్లు కూడా పిలిచింది. అంటే జిల్లాలో ధాన్యం సేకరణని గుత్తాధిపత్యం చేస్తూ ఎంపిక చేసిన మిల్లరుకు అప్పగిస్తారన్నమాట. ఇప్పటికే మద్దతు ధర అందక, తడిసిన ధాన్యం కొనుగోలుకు ఎదురు సొమ్ములు, కిలోల లెక్కన కోత, రుసుములు అందకపోవడం తదితర సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకీకృత విధానం అమల్లోకి వస్తే మిల్లరు చెప్పినట్లు తలూపాల్సిందే. మరింత నష్టాలు మూటగట్టుకోవాల్సిందే.
కష్ట కాలంలో మల్లె రైతులు - పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్న కర్షకులు