Farmers Agitation for Cotton Seeds in Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయటం మరోసారి ఆందోళనకు దారితీసింది. ఉదయం నుంచే ఆదిలాబాద్‌లోని దుకాణాల ఎదుట మేలైన (రాసీ) రకం విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. తాంసీ బస్టాండ్ సమీపంలోని ఓ దుకాణదారుడు విత్తనాల స్టాక్ లేదని చెప్పాడు. ఈ క్రమంలో రైతులకు విత్తనాలను పంపిణీ చేయకుండా ఏపీ 21 బీఎఫ్ 2666 నంబర్ జీపులో దొడ్డిదారిన విత్తనాల బస్తాలను బయటకు పంపించటం రైతుల కంట పడింది.
దీంతో ఆగ్రహించిన రైతులు జీపును అడ్డుకుని దాని టైర్లలోని గాలి తీసేసి అక్కడే రాస్తారోకో చేయటం ఉద్రిక్తతలకు దారి తీసింది. చివరికి ఆర్డీవో వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, డీఎస్పీ జీవన్ రెడ్డి వచ్చి రైతులకు నచ్చజెప్పాలని చూశారు. అయినా వారు చేసిన ప్రయత్నం ఫలితం లేకుండా పోయింది. చివరికి రైతులు అటకాయించిన జీపును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విత్తనాలను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాకు వారం రోజుల్లో 60 వేల రాసీ విత్తన సంచులను తెప్పించి ఇస్తామని ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్, వ్యవసాయాధికారి పుల్లయ్య నచ్చచెప్పటంతో రైతులు ఆందోళన విరమించారు.
వారం రోజుల్లో జిల్లాకు 60 వేల విత్తనాల ప్యాకెట్లు : విత్తనాల సరఫరాను పూర్తిగా ప్రభుత్వం చేయడం లేదని రైతులు వాపోయారు. తగినన్ని విత్తనాలను జిల్లాకు పంపిణీ చేసి రైతుల గోసను తీర్చుతారని ప్రార్థించారు. అలాగే 20 ఎకరాలు ఉన్న రైతుకు రెండు విత్తనాల ప్యాకెట్లు ఎట్లా సరిపోతాయని రైతులు నిలదీశారు. అయితే జూన్ 1వ తేదీన 20వేలు ప్యాకెట్ల విత్తనాలు జిల్లాకు రానున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. అలాగే మూడో తేదీన కూడా ఇంకో 20వేలు విత్తనాల ప్యాకెట్లు రావడం జరుగుతుందన్నారు. మళ్లీ జూన్ 6,7 తేదీల్లో ఇంకో 20వేల ప్యాకెట్లు వస్తాయి. అలాగే వారం రోజుల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 60వేల ప్యాకెట్లు విత్తనాలు వస్తాయని జిల్లా కలెక్టర్ సమావేశంలో చెప్పారని వ్యవసాయ శాఖ అధికారి వివరించారు. అందుకే రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు.
జీలుగ విత్తనాల కొరత - గంటల కొద్ది రైతుల పడిగాపులు - చివరకు లేకుండానే? - less supply jeeluga seeds