Farmer Loan Waiver in Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొన్ని రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆర్థిక శాఖ అధికారులు, మంత్రివర్గ సహచరులతో కలిసి ఈ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. దీంతో రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
దీని ప్రకారం చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికీ, సంస్థలకు ఉన్న భూములకు, ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ ఎకౌంటెంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారి భూములకు రుణమాఫీ అమలు ఉండదు. ఇలా వీరందరినీ తొలగించగా, ఇప్పుడు సుమారు 26 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అంచనా.
మొదటగా లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ : ఇందుకు జులై మొదటి వారం నుంచే దశల వారీగా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మాఫీలో భాగంగా మొదటగా రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఇందుకు సుమారు రూ.6,000 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. తర్వాత రూ.లక్షన్నర వరకు అమలు చేసే అవకాశం ఉండగా, దీనిలో రూ.6,500 కోట్లు అవసరమని సమాచారం. ఈ రెండు దశల్లోనే సుమారు రూ.16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ జరగనుంది. మిగిలిన రైతు కుటుంబాల్లో రూ.2 లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. జులైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టి రుణమాఫీకి నిధులు సమకూర్చే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఈ నెల 21న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రుణమాఫీకి సుమారు రూ.30 వేల కోట్ల నిధులు అవసరమని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా, అందుకు ఏ మార్గాల్లో నిధులు సమీకరించాలనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీ విధి విధానాల రూపకల్పనపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచన కూడా చేయనున్నారు.
ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా : మరోవైపు రైతుభరోసాకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కేవలం రైతులకు మాత్రమే రైతు భరోసా దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కానీ గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ లే అవుట్ల వంటి వాటికి మినహాయింపు ఇవ్వనున్నారు. ఇంకా ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక రైతుకు ఐదు ఎకరాలకు వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారని తెలిసింది.