Happy World Laughter Day 2024 : అప్పట్లో నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. కానీ ఇప్పుడు నవ్వు నలభై విధాల మేటి. నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం. నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో సినీ కవి. ఎలాంటి సమస్యనైనా చిన్న చిరునవ్వుతో దూరం చేయొచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి నవ్వు పట్ల నేటి తరానికి అవగాహన లేకపోవడంతో నిరంతరం ఘర్షణలు, తగాదాలతో కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు సమాజంలో భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులు, శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులు నవ్వుతో తమ సేవలు అందించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు. నవ్వు గొప్పతనాన్ని వివరించేందుకు ఏటా అక్టోబరు మొదటి శుక్రవారం ‘ప్రపంచ చిరునవ్వు దినోత్సవం’ జరుపుతున్నారు.
నవ్వుతో చెప్తే మెదడులో పదిలంగా : ఏదైనా సమస్యతో ఉన్నవారిని చిన్న చిరునవ్వుతో పలకరిస్తే కొండంత అండ దొరికినట్లుగా భావిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,209 పాఠశాలలుండగా, వాటిలో 2,11,009 మంది విద్యార్థులున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జెక్టుల్లో వెనుకబడి ఉంటున్నారు. దీంతో వారు అందరితో కలిసేందుకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వారి దృష్టి మరల్చి వారిలోంచి ఆ భావన తీసేందుకు ఆయా తరగతుల ఉపాధ్యాయులు చిరునవ్వుతో విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మెలిగితే వారి సమస్యలు దూరం చేయొచ్చంటున్నారు నిపుణులు. కోపంతో కాకుండా చిరునవ్వుతో విద్యార్థులకు పాఠాలు బోధించడం వల్ల విద్యార్థులు చాలా ఉత్సాహంగా తరగతులు వింటారని, అవి వారి మెదడులో నిక్షిప్తం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
'లాఫింగ్ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు' - Laughter Yoga Health Benefits
చిరునవ్వుతో పలకరిస్తే మనస్ఫూర్తిగా చెప్తారు : సాధారణ పౌరులకు సైతం పోలీసులంటే ఒక రకమైన భయం కలుగుతుంది. దీన్ని నివారించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో బాధితులు తమ సమస్యలను పోలీసులతో మనస్ఫూర్తిగా చెప్పే అవకాశం ప్రజలకు దక్కడం లేదు. దీన్ని నివారించేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలను పోలీసులు చిరునవ్వుతో పలకరిస్తే వారి సమస్యలు వివరంగా చెప్పగలిగే వాతావరణం ఏర్పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో యువత పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో ఉద్యోగాలు సాధించారు. వీరంతా తమ విధులను చిరునవ్వుతో నిర్వర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.
"అనుక్షణం నవ్వుతూ ఉండటం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలై సంతోషాన్ని అందించడంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వుతూ ఉండే వారికే ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. తరచూ చిరునవ్వుతో ఉండటం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు గుండె జబ్బులు నియంత్రణలో ఉండటం, రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి." - డాక్టర్ భవాని, మానసిక వైద్య నిపుణురాలు, మిర్యాలగూడ